భా రతదేశ చరిత్ర అంటే భారత రాజ్యాంగానికి ముందు భారత రాజ్యాంగం తరువాత అని చెప్పుకోక తప్పని చారిత్రక సత్యం. భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థ మొత్తం కూడా భారత రాజ్యాంగానికి లోబడి నడుస్తుంది అలాంటి భారత రాజ్యాంగం గురించి 75 ఏళ్ల స్వాతంత్ర్య, గణతంత్ర భారతదేశ చరిత్రలో భారతీయ పౌరులకి ఏమాత్రం అవగాహన లేకపోవడం ఈ దేశ పాలకులు చేస్తున్న చారిత్రక తప్పిదం. ఆ భారత రాజ్యాంగం గురించి ప్రతి పౌరుడికి తెలవాల్సిన చారిత్రక అవసరం ఉన్నదని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.విశారదన్ మహరాజ్ గత 50 రోజుల నుంచి అలుపెరగని రాజకీయ పోరాటం చేస్తున్నారు.
రాజ్యాంగాన్ని పౌరులందరికీ ప్రభుత్వమే పంచాలి: ధర్మ సమాజ్ పార్టీ
విశారదన్ మహరాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఏప్రిల్ 30, 2023 న ‘ధర్మ సమాజ్ పార్టీ’ ని ప్రకటించారు. అదే వేదికగా తమ రాజకీయ కార్యాచరణలో భాగంగా మొట్టమొదటి పోరాటంగా ఈ దేశ పౌరులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ‘భారత రాజ్యాంగాన్ని’ ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రక్రియలో భాగంగానే మే, 2 నుంచి రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ ఆఫీస్‌లో, మే,15 తారీకు నుంచి మండల తాసిల్దార్ ఆఫీస్‌లలో ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాటిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో మరల రెండవసారి మే, 22 న కలెక్టర్ ఆఫీస్‌ల ముందు, మే 29 న మండల తాసిల్దార్ ఆఫీస్‌ల ముందు నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టి కలెక్టర్లకి, ఎమ్మార్వోలకి రిప్రజెంటేషన్ ఇచ్చారు.
అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జూన్, 2 తారీకున హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని బోధించాలి, భారత రాజ్యాంగాన్ని పంచాలి పేరుతో భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విశారదన్ మహరాజ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి భారత రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల నిజంగా ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగాన్ని బోధిస్తూ రాజ్యాంగ గ్రంథాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం పీఠికే ప్రతిజ్ఞ కావాలి
భారత రాజ్యాంగ విలువలని, ప్రాథమిక హక్కులని, ప్రాథమిక విధులని ప్రతి సినిమా హాల్లో యాడ్స్‌ల రూపంలోను, పబ్లిక్ ప్లేస్‌లో, ప్రభుత్వ పరిధిలోని హోర్డింగ్‌పై, రేడియో ద్వారా భారత రాజ్యాంగ విలువల గురించి గ్రామస్థాయి నుంచి మొదలుకొని దేశ రాజధాని వరకు ప్రతి పౌరుడికి తెలియపరచాలి. ఈ దేశంలో ఉన్నది ఒక్క ‘భారత రాజ్యాంగ సంస్కృతియే’ అంటున్నారు విశారదన్. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగ సంస్కృతిలో పుట్టి పెరగాలని విశారదన్ మహరాజ్ చెప్తున్నారు. చట్టసభలకు వెళ్లే ప్రజా ప్రతినిధులకు భారత రాజ్యాంగం గురించి ప్రత్యేకమైన కోర్సు పెట్టి అవగాహన కల్పించాలని, అదేవిధంగా అన్ని విద్యాసంస్థల్లోనూ భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చేయించాలని ధర్మ సమాజ పార్టీ ద్వారా విశారదన్ డిమాండ్.
కానీ ఏది ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా నిజంగానే పార్టీలకతీతంగా దేశ అభివృద్ధిని, ప్రపంచ దేశాల ముందు దేశ సార్వభౌమాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని "ధర్మ సమాజ్ పార్టీ" వ్యవస్థాపకులు డాక్టర్.విశారదన్ మహరాజ్ చేస్తున్న డిమాండ్ ప్రకారం భారత రాజ్యాంగ ఉచిత పంపిణీ, బోధన మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే, సామాజిక రాజకీయ విప్లవం సంభవించి ప్రపంచ దేశాలతో పోటీపడి అభివృద్ధి చెందిన దేశంగా అతి కొద్ది కాలంలోనే భారతదేశాన్ని కూడా చూడగలుగుతాం.
- పి. గణేష్,