వెలుగు సక్సెస్ : సింధు సామాజిక వ్యవస్థ

ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి. ఈజిప్టు, మెసోపొటేమియాలతో  సమానంగా విలసిల్లింది. వాయవ్య భారతదేశంలో విరాజిల్లిన సింధు నాగరికత ప్రజలు ప్రకృతి దేవతారాధన చేశారు. ముఖ్యంగా అమ్మ తల్లి, జననాంగాలు, పశుపతి మహాదేవుడుని ఆరాధించినట్లు తెలుస్తోంది. కానీ, వీరు ఏ మతం ఆచరించారో స్పష్టంగా తెలియడం లేదు. సింధు ప్రజలు భూత, ప్రేత పిశాచాలను నమ్మారు. ఈ సమాజ ప్రజలు మాతృస్వామిక వ్యవస్థను అవలంబిం చారు. వీరిది చిత్ర లిపి. పలు రకాల జంతువులను మచ్చిక చేసుకున్నారు.

సింధు నాగరికత ప్రజల మతం గురించి కచ్చితమైన సమాచారం లేదు. మత విశ్వాసాలను ప్రతిబింబించేలా ఆలయాలు కానీ ప్రజలంతా కలిసి ఆరాధించే ప్రదేశాలు కాని లభించలేదు. దీనిని బట్టి సింధు ప్రజల మతం వ్యక్తిగత విశ్వాసమని అర్థమవుతుంది. ముద్రికలు, టెర్రాకోట బొమ్మలు, కంచుబొమ్మలు, హోమ గుండాలు, సమాధుల్లో లభించిన వస్తువులు, తాయత్తులపై ఆధారపడి వీరి మతాన్ని విశ్లేషిస్తున్నారు.
 
అమ్మ తల్లి: సింధు ప్రజలతో పూజలందుకున్న ప్రధాన దైవం అమ్మతల్లి. ఈమెనే ప్రకృతి దేవత, పునరుత్పత్తి దేవత, వ్యవసాయ దేవతగా చెప్పారు. అమ్మతల్లి ఆరాధన స్త్రీ దేవతలను పూజించడాన్ని సూచిస్తుంది. ఆనాటి సమకాలీన నాగరికతల్లో అమ్మతల్లిని పోలిన దేవతలు సుమేరియాలో ఇనన్న(ఇష్టార్), ఈజిప్టు ఇసీస్​. 

జననాంగముల పూజ: సింధు ప్రజలు స్త్రీ, పురుషుల మర్మాంగాలను కూడా పూజించారు. లింగాన్ని పూజించే ఆధారం మొహెంజొదారోలో లభ్యం కాగా, రాతి యోనిని పూజించే ఆధారం హరప్పాలో లభ్యమైంది. 
 

ప్రకృతి జీవులను పూజించడం: ప్రాచీన సింధు ప్రజలు వృక్షారాధన చేశారు. ఈ నాగరికత ప్రజలు పూజించిన ప్రధాన వృక్షం రావిచెట్టు, మర్రి చెట్టు. సింధు ప్రజలు పావురం, మొసలి, మూపురం గల ఎద్దును కూడా పూజించారు. ఈ విధమైన పూజ సంకేతాత్మక మత విధానాన్ని సూచిస్తుంది. 

పశుపతి మహాదేవుడు: ఈ నాగరికత ప్రజలు పూజించిన ఏకైక పురుష దేవుడు పశుపతి మహాదేవుడు. పశుపతి మహాదేవుడి బొమ్మ కలిగిన చతురస్రాకార ముద్రి మొహెంజొదారోలో లభ్యమైంది. ముద్రికలో పశుపతి మహాదేవుడు ధ్యాన భంగిమలో కూర్చొని ఉన్నాడు. పశుపతి మహాదేవుడు అర్థ నిమీలిత నేత్రాలతో, మూడు తలలు, రెండు కొమ్ములు కలిగి ఒకే వేదికపై ధ్యాన నిష్టలో కూర్చొని ఉన్నాడు. అతని చూట్టు నాలుగు జంతువులు ఉన్నాయి. కుడి పక్క ఏనుగు, పులి, ఎడమ పక్క దున్న, ఖడ్గమృగం, వేదిక కింద రెండు జింకలు. 

స్వస్తిక్​ గుర్తు: ఇది సింధు ప్రజల చిహ్నం. దీనిని కూడా పూజించారు. సింధు ప్రజలు భూత, ప్రేత పిశాచాలను నమ్మారు. ఈ భూత, ప్రేతాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి తాయత్తులను కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇది మూఢ నమ్మకాలను తెలియజేస్తుంది. 

మత సంస్కారాలు

ప్రజలు వివిధ రకాలైన కనన పద్ధతులను పాటించారు. వ్యక్తిని పూడ్చి పెట్టే విధానాన్ని అధికంగా పాటించారు. సమాధుల్లో ఆ వ్యక్తులు జీవించి ఉండగా, వారికి ఇష్టమైన వస్తువులను ఉంచేవారు. మృతదేహాలను ఉత్తర, దక్షిణంగా పెట్టి ఖననం చేసేవారు. మృతదేహం తల ఉత్తరం వైపు  ఉండేటట్లు వెల్లకలా పడుకోబెట్టి ఉన్నాయి. పాక్షిక ఖననం(శరీరంలోని ఏదో ఒక అవయవం పూడ్చి పెట్టే విధానం) చేసినట్లు ఆధారం లభించిన సింధు నాగరికత ప్రాంతం బన్వాలి. ఇది వీరశైవ మత సంప్రదాయాన్ని పోలి ఉంది. కుండల్లో చితాభస్మాన్ని పూడ్చి పెట్టే ఆచారానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరం రంగ్​పూర్​. 

సమాజం

సింధు సమాజం ప్రధానంగా మాతృస్వామిక సమాజంగా ఉండేది. హరప్పా స్మశాన వాటికలో ఒకే రకమైన జన్యు లక్షణాలు కలిగిన మహిళలను పూర్చి పెట్టిన విధానం, ఇళ్లల్లో పెద్ద మొత్తంలో లభించిన మాతృ దేవత విగ్రహాలను బట్టి మాతృస్వామ్య పద్ధతి అమలులో ఉండి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. సింధు సమాజంలో ఆర్థిక అసమానతలు కనిపిస్తాయి. ధనికుల ఇళ్లు సాపేక్షంగా పెద్ద ప్రాంతంలో చుట్టూ ప్రహారీతో కాల్చిన ఇటుకలతో సొంత బావితో విశాలమైన గదులతో నిర్మితమై ఉంటాయి. పేదలు కేవలం రెండు గదుల నిర్మాణంలో జీవించేవారు. హరప్పా, మొహెంజొదారో నగరాల్లోని ధనికుల ఇళ్లను, కూలీల ఇళ్లతో పోలిస్తే ఈ అంతరాలు మరింత స్పష్టంగా తెలుస్తాయి. 

జంతువుల మచ్చిక

సింధు నాగరికత ప్రజలు ఎద్దులు, కుక్కలు, పందులు, పిల్లులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. కుక్కలు పెంపుడు జంతువుగా ఉండేవి. ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు ఎద్దు. సింధు ప్రజల ప్రధానమైన రవాణా సాధనం ఎడ్ల బండి లేదా ఎక్కా.

లిపి: సింధు నాగరికత లిపి బొమ్మలతో కూడుకుని ఉంది. కాబట్టి సింధు లిపిని చిత్రలిపిగా పేర్కొంటారు. చిత్రిలిపికి మరో పేరు జుయలిక్​. సింధు లిపిని అధ్యయనం చేయడానికి ముఖ్య ఆధారాలు ముద్రి కలు. కొన్ని సందర్భాల్లో రాగి తాయెత్తుల పైన, గాజులపైన కనిపించాయి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు ఉన్న వీరి లిపి ఆధారంగా వీరిది సర్పలేఖనం లేదా నాగవల్లికల లిపి అని పేర్కొన్నారు. ఈ లిపిలో కొనసాగింపు కనిపించదు. 1965 కంటే ముందు ఈ లిపిపై ఫాదర్ హెన్రీ హెరాస్​, జి.ఆర్.హంటర్​ పరిశోధన చేశారు. 1853లో లిపి తొలి సమాచారం, 1923లో పూర్తి లిపి అందుబాటులోకి వచ్చినా ఇప్పటివరకు చదవలేకపో తున్నారు. సింధు ప్రజల భాషల మూల ద్రావిడమని చరిత్రకారుడు హెన్రీ హెరాస్​, నోరోజోన్​, మహాదేవన్​, ఆస్కో పర్పోలా పేర్కొన్నారు. 

సింధు సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం - తాపీ మేస్త్రీలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చేతి వృత్తి
-  ఇటుకల నిర్మాణం 
సింధు ప్రజల ప్రధాన వినోదం
-  పాచికల ఆట
సింధు ప్రజల ఇతర వినోదాలు 
-  చదరంగం, నృత్యం, వేట
సింధు ప్రజల ఆట బొమ్మల్లో అధికంగా లభ్యమైన ఆటబొమ్మ - బండి బొమ్మ
వీరి కాలంలో వాడే బొగ్గు ముక్కలకు పేరు -  శిలాజాట