కుంభమేళా కొనసాగుతుంది. చాలామంది హిందువులు.. సాధువులు.. కుంభమేళా కార్యక్రమానికి హాజరవుతున్నారు. అసలు కుంభమేళ చరిత్ర ఏమిటి.. కుంభమేళాలో సాధువులు ఏం చేస్తారు.. సామాన్య మానవులు ఏం చేయాలో తెలుసుకుందాం. .
కుంభమేళా ప్రారంభమైంది. శివరాత్రి (26 ఫిబ్రవరి 2025) వరకు పవిత్ర గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్ లో జరుగుతోంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని .. కుంభమేళా... అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని అర్థ కుంభమేళా అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘీమేళా అనే పేరుతో పిలుస్తారు. బాండమును కుంభము అని ...కలశం.. అని అంటారు, ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ లో గంగా, యమునా మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద కుంభమేళా నిర్వహిస్తున్నారు.
విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి అక్కడి నుండి శివుడి జటాజూటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో కుంభమేళా జరుగబోతున్నది. మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే యాజ్ఞవల్క్య మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని పురాణాలు తెలియజేస్తున్నాయి.
కుంభమేళ చరిత్ర..
హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దాసిగా ఉన్న తల్లి వినితను ...మరియు తనను, పినతల్లి కద్రువ బానిసత్వం నుండి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు ఎదురుగా వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మె పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే నీవు అమృత బాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్బలపై ఉంచి నీవు నీ తల్లి విముక్తులు కాగలరు. వెనువెంటనే ఆ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకం తీసుకొని వెళ్తానని చెప్పి అలాగే చేశాడు ఈ క్రమంలోనే కలశం నుండి అమృతం భూలోకమున నాలుగు నదులలో నాలుగు చోట్ల కొన్ని చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశములను పుణ్యస్థలాలుగా తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది.
కుంభమేళాలో ఏం చేయాలంటే...
కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు... కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు మరియు విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునుల చేత సన్యాసుల చేత నెలల తరబడిగా ఆ ప్రాంతంలోనే డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త క్రొత్త విషయాలను దేశం నలుమూలల నుండి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయమని పురాణాలు చెబుతున్నాయి.
ALSO READ | తెలంగాణాలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
అక్కడ ఏర్పాటు చేసిన స్నానాల ఘాట్ లో స్నానాలు ఆచరించాలి. తరువాత పితృ దేవతలకు పిండ ప్రదానం చేయాలి. ఇలా చేస్తే వారు ఉన్నత లోకాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత అన్నదాన శిబిరాలకు శక్తిమేరకు ధనం.. ద్రవ్యం.. ఏదైనా విరాళం ఇవ్వాలి. తరువాత అక్కడున్న మునులకు.. బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.