
భా రత ప్రభుత్వం చట్ట 1935 ద్వారా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. అందువల్ల మనవాళ్లు స్థానిక పరిపాలన సంస్థలను పటిష్టపర్చడానికి కొంతమేరకు కృషి చేశారు. 1937లో రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో స్థానిక సంస్థల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 1947లో స్వాతంత్య్రానంతరం దేశ పరిపాలనకు అవసరమైన రాజ్యాంగ రచన సందర్భంగా శ్రీమన్నారాయణ్ అగర్వాల్ రాజ్యాంగ పరిషత్‌లో గ్రామస్థాయి మొదలుకొని దేశస్థాయి వరకు పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు గురించి తెలిపే గాంధీ ప్లాన్‌ను ప్రతిపాదించారు.
రాజ్యాంగం నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థతో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు. ఏడో షెడ్యూల్లోని ప్రభుత్వ అధికారాల జాబితాల్లోని స్థానిక స్వపరిపాలన అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉంది. స్థానిక స్వపరిపాలన ఆదేశిక సూత్రాల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై మాత్రమే ఈ అంశం ఆధారపడి ఉండేది. 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక సంస్థలను 9వ భాగం, 9ఏ భాగంలతో చేర్చడం ద్వారా రాజ్యాంగబద్ధతను కల్పించారు.
బల్వంత్రాయ్ మెహతా కమిటీ
1951లో ప్రవేశ పెట్టిన మొదటి ప్రణాళిక, 1952లో ప్రవేశ పెట్టిన సామాజిక అభివృద్ధి పథకం, 1953లో ప్రారంభించిన జాతీయ విస్తరణ సేవా పథకాల అమలు తీరును పర్యవేక్షించుకోవాల్సిన ఆవశ్యకతను జాతీయ అభివృద్ధి మండలి, ప్రణాళిక సంఘం గుర్తించాయి. ఇందుకోసం 1957లో కేంద్ర ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1957 చివరిలో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానిక సమర్పించింది.
పంచాయతీరాజ్ వ్యవస్థను వెంటనే స్థాపించాలని 1954లో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక ఉన్నతస్థాయి కమిటీ చేసిన సూచననే బల్వంతరాయ్ కమిటీ కూడా ప్రతిపాదించింది. 1952లో ప్రవేశపెట్టిన పథకంతో సహా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమవుతుందని, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఇందుకు పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పడమే ఏకైక పరిష్కారమని సూచించింది.
బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనలను కేంద్ర ప్రభుత్వం, జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించడంతో స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటుకు సరైన దృక్పథంతో పునాదులు వేశారు. 1959, అక్టోబర్ 2న రాజస్తాన్‌లోని నాగోర్ జిల్లాలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1959, నవంబర్ 1న మహబూబ్‌నగర్ లోని షాద్ నగర్లో ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థను అమలు చేసిన రెండో జిల్లా శ్రీకాకుళం.
పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం
పరిపాలన, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రాతిపదికలు స్థానిక స్వపరిపాలనా సంస్థలు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన విషయాలు పేర్కొన్నారు. స్థానిక స్వపరిపాలన అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉండటంతో వీటి ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉన్నది. బల్వంత్రాయ్ మెహతా కమిటీ సూచనలను అనుసరించి 1959లో జవహర్ లాల్ నెహ్రూ మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
1959 నుంచి 1964 వరకు ప్రారంభ స్ఫూర్తితో అనేక రాష్ట్రాలు వీటిని ఏర్పాటు చేసినప్పటికీ క్రమబద్ధంగా నిర్వహించకపోవడంతో స్థానిక స్వపరిపాలన కుంటుపడింది. జనతా ప్రభుత్వకాలంలో నియమించిన అశోక్ మెహతా కమిటీ సూచనల అమలుతో స్థానిక స్వపరిపాలన పునరుజ్జీవన దశ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల నిర్మాణం ఒకే విధంగా లేకపోవడం, నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించకపోవడం, నిర్మాణ నిర్వహణలో మార్పులు, చేర్పుల కోసం వివిధ కమిషన్లు అనేక సూచనలు చేశాయి. సి.హెచ్.హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో జిల్లా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ లేదా రాష్ట్ర మంత్రి చైర్మన్‌గా వ్యవహరించాలని కమిటీ సూచించింది.
అభివృద్ధి విషయంలో కలెక్టర్ కీలకపాత్ర పోషించాలని 1985లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయాలని జి.వి.కె.రావు కమిటీ సూచించింది. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను రద్దు చేయాలని కలెక్టర్ అధికారాల్లో కొన్నింటిని డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ అధికారికి బదిలీ చేయాలని తెలిపింది. స్థానిక సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నియమించిన ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ, ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికలు లక్ష్య సాధనలో స్థానిక సంస్థల ప్రాధాన్యత అనే అంశంపై అధ్యయనం చేసి 73వ రాజ్యాంగ సవరణకు అవసరమైన అనేక సూచనలను చేసింది.
స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి.గ్రామీణ పరిపాలనలో గ్రామసభలకు ప్రాధాన్యమివ్వాలి. స్థానిక సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేసి సాధారణ పరిపాలన నుంచి వేరు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి.
రాజ్యాంగ బద్ధత
సింఘ్వీ కమిటీ చేసిన సూచనలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం కోసం ఆనాటి కేంద్ర మంత్రి తుంగన్ నాయకత్వంలో 1987లో ఒక కమిటీ నియమించారు. ఈ కమిటీల సూచనల ప్రకారం స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించడం కోసం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. లోక్‌సభ 64వ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ తిరస్కరించింది. 65వ సవరణ బిల్లు లోక్‌సభలో చర్చకొచ్చే సమయంలోనే ఆ సభ రద్దు కావడంతో ఆ బిల్లు కూడా రద్దయింది.
1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం 70వ రాజ్యాంగ సవరణ బిల్లుగా స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రభుత్వం మధ్యలోనే అధికారాన్ని కోల్పోవడంతో గతంలో మాదిరిగానే బిల్లు ఆచరణకు నోచుకోలేకపోయింది. 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పి.వి.నర్సింహారావు ప్రభుత్వం రాజీవ్‌గాంధీ కాలంలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో అనేక మార్పులు చేస్తూ గ్రామీణ పరిపాలన సంస్థలైన పంచాయతీరాజ్ సంస్థలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధత కల్పించారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ, నగర పాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు.
1992లో పార్లమెంట్ ఈ బిల్లులను ఆమోదించగా 17 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సవరణలకు ఆమోదాన్ని తెలిపాయి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్‌ను, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా12వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. షెడ్యూల్ 11 ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపై అధికారాలను బదిలీ చేస్తే, షెడ్యూల్ 12 ద్వారా పట్టణ, నగర పాలక సంస్థలకు 18 విషయాలపై అధికారాల బదిలీ చేశారు. 1992లో ఆమోదించిన చట్టాలు 1993 నుంచి అమల్లోకి వచ్చాయి.