ఆధ్యాత్మికం: అది చెట్టుకాదు.. ఆ ఊరును కాపాడే మహాతల్లి మైసమ్మ.. తెలంగాణలో ఎక్కడుందంటే..

చెట్టు, పుట్ట, కొండలు, గుట్టలు..  ఇలా ప్రతి అణువులోనూదేవుడుంటాడని హిందువుల నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఓ మర్రిచెట్టు ఆలయమై, భక్తుల  కొంగు బంగారంగా మారింది. మర్రిచెట్టు కింద మైసమ్మ కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత.

కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతానికి సమీపాన ... చుట్టూ పచ్చని పొలాలు... మధ్యన 150 ఏళ్ల క్రితం నాటి మర్రి చెట్టు. ఇప్పుడది మహా వృక్షమైంది. ఊడలతో విస్తరించింది. మర్రి ఊడలు 50 వరకు ఉంటాయి. ఇవి సున్నాలకు మల్లే కనిపిస్తూ.. ఎంత దూరం చూసినా చాలా బాగా కనిపిస్తుంది. సరిగ్గా మర్రిచెట్టు కిందే మైసమ్మ తల్లి కొలువుదీరింది. 

ఈ మర్రిచెట్టు మైసమ్మే భక్తుల కొంగుబంగారంగా మారింది. కోరిన కోర్కెలు తీర్చే ఈ ఆలయం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారంలో ఉంది. ఒక్కసారి అమ్మవారిని దర్శిస్తే... కోరికలు తీరుతాయని గ్రామస్తుల నమ్మకం.

మర్రిచెట్టు కింద మైసమ్మ

 గ్రామ శివారులో.. ఓ లోతట్టు ప్రాంతంలోనీటి నిల్వ కోసం కట్టను ఏర్పాటు చేయాలనుకున్నారు గ్రామస్తులు. ఎన్నిసార్లు నిర్మించినా... ఆ కట్ట నిలవలేదు. దాంతో గ్రామస్తులంతా ఏకమై మైసమ్మ తల్లిని ప్రతిష్టించారు.అప్పటి నుంచి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటున్నారు. ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. పంటలు కూడా సమృద్ధిగా పండుతున్నాయి. అప్పటినుంచి భక్తుల కొంగుబంగారంగా మారింది .

ALSO READ | ఇంటిపై పిడుగు పడకుండా ఉండటానికి ఈయనే కారణం.. గొప్పోడు బెంజిమిన్ ఫ్రాంక్లిన్

 ఇదే మర్రిచెట్టు కింద పుట్ట ఉంది. నాగుపాము ఒకటి రాత్రి సమయంలో  బయటకు వచ్చి అమ్మవారిని పూజిస్తుందట.  అర్ధరాత్రి మైసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. అందుకే రాత్రిళ్లు అక్కడికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు" అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది.

కొంగుబంగారంగా పేరొందిన ఈ ఆలయానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. గ్రామంలో ఏ మంచి జరిగినా మైసమ్మ తల్లి మహిమగా చెప్పుకుంటారు. అందుకే ఈ గ్రామంలో చాలామంది మైసమ్మ పేరే పెట్టుకుంటారు.ప్రతి  కుటుంబంలో ఒకరిద్దరు మైసమ్మ పేరుతో ఉంటారు. గ్రామం చల్లగా ఉందంటే మైసమ్మదయే అని స్థానికులు అంటున్నారు. 

-వెలుగు,లైఫ్-