సకల జనుల కష్టార్జితంతో ఏర్పడిన తెలంగాణ.. ఎందరో త్యాగధనుల త్యాగాల కలల పంట. ఒక్కడి రాజకీయ చతురతతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్న తప్పుడు చరిత్రను లిఖించాలనుకున్న వారి కుట్రలను బట్టబయలు చేయాలి. ఈ బాధ్యత పౌర సమాజంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీపై కూడా ఉంది. ఉద్యమ పులుల చరిత్రను పులులు రాసుకోకుంటే గుంటనక్కలు రాసిందే చరిత్రగా ఘనతకెక్కుతుంది.
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తప్పుడు చరిత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చి అసలు చరిత్రను దాచిపెట్టారు. ఇది ముమ్మాటికీ ఉద్యమ ద్రోహమే. తెలంగాణ గోసను తన గొంతుతో పాడిన బెల్లి లలితను పదహారు ముక్కలుగా కోయబడ్డ చరిత్ర నేటి తరానికి పరిచయం కావాలి. భువనగిరి సభ ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించి కోస్తా ఆంధ్రా పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గద్దర్ పై కాల్పులు జరిపిన కారణాలు అధికారికంగా చరిత్రలో నమోదవ్వాలి.
తెలంగాణ విమోచన ఉద్యమంతోపాటు తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న భూపతి కృష్ణమూర్తి, జైని మల్లయ్య గుప్త , తెలంగాణ ప్రత్యేక రాష్టం కోసం మంత్రి పదవిని కోల్పోయి జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు తూగే తక్కెడ నేటి సమాజంలో ఉందా?. కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడు బియ్యాల జనార్దన్ రావును యాది చేసుకుంటున్నామా?. తెలంగాణ ఉద్యమంలో రాజ్యహింసను ఎదుర్కొని ఎదురు కాల్పులు పేరిట అమరులైన ఐలయ్య, నల్ల వసంత్ ఎవరో గుర్తున్నారా?. తెలంగాణ ముల్కీ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకూ తెలంగాణ ఉద్యమ కాగడా ఆరిపోకుండా కాపాడిన ప్రొఫెసర్ కేశరావు జాదవ్ చరిత్రను తుంగలో తొక్కిన దుర్మార్గపు కుట్రను భగ్నం చేయాలి.
అమరుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించాలి
తెలంగాణ ధూంధాం పేరుతో ఊరూ వాడ కలతిరిగిన కళాకారులను తీవ్ర నిరాదరణకు గురిచేశారు. బంగారు తెలంగాణ నిర్మాణం పేరుతో తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి తొమ్మిది ఏండ్ల పాలనలో ఉద్యమకారులను అవమానపరిచారు. అమర జ్యోతి పేరుతో ఏ మాత్రం స్ఫూర్తి లేని నిర్మాణాన్ని చేపట్టి అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాజా ఎన్నికల్లో ఓటమి వరకూ అబద్ధాల పునాదులపై పార్టీని నిర్మించి ఆవినీతి సామ్రాజ్యాన్ని కేసీఆర్ అన్నిదిశలకు విస్తరించాడు.
తెలంగాణ సోయి, అమరుల ఆకాంక్షలకు చోటు లేకుండా.. స్వీయ అస్తిత్త్వం, వ్యక్తివాదమే ఎజెండాగా ఏలారు. సకల జనుల పోరాట చరిత్రను మరుగున పడేసి కేసీఆర్ చరిత్ర మాత్రమే ఉద్యమ చరిత్రగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమానికి తీరని ద్రోహం చేశారు. ఎంతోమంది యోధులకు గుర్తింపు, కనీస గౌరవం దక్కకుండా ఉద్యమ ద్రోహాన్ని మూటగట్టుకున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్రపై కమిటీ వేయాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉద్యమం కోణాన్ని అధికారికంగా నమోదు చేయకపోతే అమరుల ఆత్మలు
ఘోషిస్తాయి. తొలి, మలి దశ ఉద్యమంలో అమరుల చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించాలి. త్యాగాలు చేసిన వారి జ్ఞాపికగా ప్రతి జిల్లా కేంద్రంతో పాటు రాజధానిలో స్మారక నిర్మాణాలు, పార్కులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సోనియా గాంధీకి తెలంగాణ అత్యున్నత పౌర పురస్కారం అందజేసి గౌరవించాలి.
యావత్ భారతావనిలో ప్రత్యేక ఉనికి, అస్తిత్వం ఉన్న తెలంగాణలో ప్రజల కోణంలో రాజకీయాలు నిరంతర స్రవంతిగా ప్రవహిస్తుంటాయి. అందుకే తెలంగాణలో ప్రతి బిడ్డ ప్రస్థానం ఉద్యమాల ఉగ్గు పాలతో మొదలవుతుంది. మసిపూసి మారేడుకాయ అంటే నమ్మడానికి తెలంగాణ సమాజం తెగువ సన్నగిల్లేది కాదని గుర్తించకపోవడం కేసీఆర్ భావ దారిద్ర్యం. ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గత పాలకులు రాసిన తప్పుడు చరిత్రను చెరిపేయాలి. అసలైన చరిత్ర రచనకు శ్రీకారం చుట్టాలి. అదే తెలంగాణ త్యాగధనులకు నిజమైన నివాళి.
తెలంగాణ ఉద్యమానికి.. ప్రపంచం సెల్యూట్
తెలంగాణ ఉద్యమకారులకు సమాంతరంగా రాజకీయ పార్టీలలో ఉండి కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన నేతలకు సైతం తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో తెలంగాణపై ఒత్తిడి తెచ్చిన ఆలె నరేంద్ర, చివరకు తాను అమితంగా ఇష్టపడే పార్టీకి దూరమయ్యారు. చిన్నారెడ్డి, కోదండరెడ్డి, పి జనార్దన్ రెడ్డి చేసిన కృషి, ఆమోస్ కార్యదక్షత వెలకట్టలేనిది. తెలంగాణ సాధన కోసం అనేక సంస్థలు, వేదికలు, వ్యక్తులు సమూహాలు తమ ప్రాణాలను పణంగా పెడితే, కొంతమంది నేతలు ఇస్త్రీ మడత చెడకుండా ఉద్యమ ఫలితాలను,అందరి ఉమ్మడి కృషిని సొంత ఖాతాలో జమ చేసుకున్నారు.
పాశం యాదగిరి, ఇన్నయ్య, కోదండరాం లాంటి వారిని తొమ్మిదేండ్లు పాలించిన పాలకులు వారి పట్ల ప్రవర్తించిన తీరు తెలంగాణ సమాజం మరిచిపోలేదు. రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికిన జాక్ అధ్యక్షుడు కోదండరాం పట్ల కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో తెలియనిది కాదు.అసమాన తెలంగాణ వీరుల త్యాగాల ముందు ప్రపంచ ఉద్యమాలే సెల్యూట్ చేసిన ఖ్యాతి తెలంగాణ ఉద్యమానిది. తెలంగాణ ఉద్యమానికి ఇంధనంగా నిలిచి పరిగెత్తించిన అమరుల త్యాగాలకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.
- దొమ్మాట వెంకటేశ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్