
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుగుతాయి.. అసలు ఆ ఉత్సవాలను మొదటి సారి ఎవరు ప్రారంభించారు.. బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి గల కారణం ఏమిటి.. పురాణాలు ఏం చెబుతున్నాయి.. బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. . .
శ్రీవేంకటేశ్వరుడు.... శ్రీనివాసుడు... వేంకటాద్రిపై వెలిసిన తొలి రోజుల్లో బ్రహ్మ దేవుడిని పిలిచి లోక కళ్యాణం నిమిత్తం తనకు ఉత్సవాలు జరపాలని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడుకొండల స్వామికి కన్యామాసంలో ( బాధ్రపదమాసంలో) శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. ఈ ఉత్సవాలను బ్రహ్మ నిర్వహించాడు కాబట్టి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ది చెందాయి. అప్పటి నుంచి నిరాటకంగా బ్రహ్మోత్సవాలను అధికారులు నిర్వహిస్తున్నారు.
చాంద్రమానం ప్రకారం...
32 నెలలొక సంవత్సరాల కొకసారి అధిక మాసం వస్తుంది. ఇలా అధిక మాసం వచ్చినప్పుడు బాధ్రపదమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. దసరా నవరాత్రిళ్లు జరిగే సమయంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదుగానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజారోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం వచ్చినందున సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు... అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఉత్సవాలు ఇలా...
ప్రపంచంలో మానవులందరూ సుభిక్షంగా ఉండాలని సెప్టెంబర్ 17న వేద పండితులు సంకల్పంతోపాటు అంకురార్పణ చేస్తారు. 18 వ తేదీన ధ్వజారోహణంతో పాటు.. స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. ఉత్సవాల సమయంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read :- శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు పకడ్బందీ ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
మాడ వీధులలో....
భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీలలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.
శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం...
బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు. సెప్టెంబరు 26న చక్రస్నానం రోజున విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం.. భక్తులు అందరూ ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని, సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించాలని టీటీడీ తెలిపింది. .