హిస్టరీ ప్రశ్నల తీరు మారింది

హిస్టరీ ప్రశ్నల తీరు మారింది

చరిత్ర అంటే రాజులు, వారు పాలించిన కాలం, యుద్ధాలు అనే మూసధోరణిలో కాకుండా సాహిత్యం, సంస్కృతి, కళలు, ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి అంశాలపై ఫోకస్ చేస్తూ అభ్యర్థులు ప్రాక్టీస్​ చేయాలి. మారుతున్న పరీక్ష విధానంకు అనుగుణంగా ప్రిపరేషన్​ ప్లాన్​ ఉండాలి. టీఎస్​పీఎస్సీ అభ్యర్థి మెమరీ బేస్డ్ ఆధారంగా కాకుండా క్రియేటివిటీ ఓరియంటేషన్​లో సిలబస్​ రూపొందించింది. భారత, తెలంగాణ చరిత్ర, ఉద్యమం నుంచి ఏ టాపిక్స్​ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎలా ప్రిపేర్​ అవ్వాలి, ఏయే పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి.. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం...

అందరికి అనుగుణంగా సిలబస్​ 

అకడమిక్, పోటీ పరీక్షల మధ్య మౌలికమైన తేడా ఉంటుంది. అక్కడ పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలే అడుగుతారు. కానీ పోటీ పరీక్షల్లో పాఠ్య పుస్తకాల్లోని అంశాలతో పాటు సామాజిక, చారిత్రకాంశాలపై అవగాహన ఉండాలి. అందుకే హిస్టరీ అనగానే బీఏలో (డిగ్రీ) హిస్టరీ చదువుకున్న వారికే సులభం అనే అపోహ అక్కర్లేదు. ఆర్ట్స్, సైన్స్, టెక్నికల్ కోర్సులు.. ఇలా అన్ని రకాల వారికి అనుగుణంగా సిలబస్‌‌‌‌‌‌‌‌ రూపొందించాం. 

ఇండియన్​ హిస్టరీ

అభ్యర్థులు జాతీయోద్యమం నుంచే ఎక్కువగా ప్రశ్నలు వస్తాయనే ఆలోచనతో ఉంటారు. కానీ అది అవాస్తవం. చరిత్ర– సంస్కృతి, వారసత్వం, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, స్వాతంత్య్ర ఉద్యమం.. ఇలా అన్ని దశలు ప్రాధాన్యతగలవిగానే భావించాలి. బ్రిటీష్‌‌‌‌‌‌‌‌ వారి పాలనలో వచ్చిన మార్పులు.. అవి రాజకీయ, సామాజిక, ఆర్థిక, రంగాలపై అభ్యర్థులు ప్రత్యేకంగా నోట్స్‌‌‌‌‌‌‌‌ రాసుకోవాలి. 

ప్రాచీన, మధ్యయుగ తెలంగాణ చరిత్ర

ప్రాచీన చరిత్రలో శాతవాహనుల నుంచి చాళుక్య యుగం వరకు ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు శాతవాహనుల కాలానికి సంబంధించి తేదీలు, రాజ వంశీయుల క్రమంపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటిపై చరిత్రకారులు ఒకరకంగా రాస్తే శాసనాల్లో మరో రకంగా ఉంది. కానీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వర్తక వ్యాపారాలు, సాహిత్య వికాసం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తే ఉపయోగం. మధ్యయుగ చరిత్రలో కాకతీయ, పద్మనాభ, కుతుబ్‌‌‌‌‌‌‌‌షాహీల వరకు చరిత్ర ఉంటుంది. ఇందులో ఆనాటి సామాజిక, వర్తక, వాణిజ్య అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రజా సంక్షేమం, విద్యా రంగం వంటి అంశాలను చదువుకోవాలి.

ఆధునిక తెలంగాణ చరిత్ర

ఇందులో అసఫ్‌‌‌‌‌‌‌‌జాహీల కాలం నుంచి ఉంటుంది. 1724 నుంచి 1948 వరకు జరిగిన అన్ని చారిత్రక అంశాలు ఉంటాయి. ముఖ్యంగా నిజాం కాలం నాటి సంస్కరణలు, వ్యవసాయ రంగంలో భూమిశిస్తు విధానం, విద్యారంగం, రోడ్డు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అసఫ్‌‌‌‌‌‌‌‌జాహీల కాలంనాటి సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు.. ప్రధానంగా ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, ఆంధ్ర మహాసభ నిర్వహించిన రాజకీయ ఉద్యమాలు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన రాజకీయ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటంపై దృష్టి పెట్టాలి.

తెలంగాణ ఉద్యమం 

అభ్యర్థులు ఉద్యమానికి దోహదం చేసిన సామాజిక, ఆర్థిక కారణాలు, అస్థిత్వ పోరాటం, ఆకాంక్షల కోసం వివిధ సంస్థలు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాయన్న కోణంలో చదువుకోవాలి. 1952లో మొదటిసారిగా జరిగిన ముల్కీ ఉద్యమం.. 1969– -70లో వచ్చిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు, 1990వ దశకంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన రాజకీయ, రాజకీయేతర , పౌరసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, మేధావి వర్గాలు స్థాపించిన సంస్థలు, సంఘాలు, వాటి పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన తర్వాత జరిగిన వివిధ ఘట్టాలను మలిదశ ఉద్యమంలోకి తీసుకోవాలి. ఇందులో వివిధ పార్టీలు, జేఏసీ, ఉద్యోగులు, కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని సమష్టి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజా ఉద్యమంగా మారిన తీరు.. అందులో వివిధ పక్షాల పాత్రపై అవగాహన ఉంటే ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానం ఇవ్వొచ్చు.

ప్రామాణిక పుస్తకాలే చదవాలి

అభ్యర్థులు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు రాసినవి ప్రామాణికం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ పుస్తకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.

సొంత నోట్స్‌‌‌‌‌‌‌‌.. ఎంతో మేలు

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సొంత నోట్స్‌‌‌‌‌‌‌‌ రాసుకోవాలి. ఇది రివిజన్​ సమయంలో ఉపయోగపడుతుంది. ఏదైనా అంశాన్ని చదువుతున్నప్పుడు ముందుగా బేసిక్స్​ నోట్స్‌‌‌‌‌‌‌‌లో పొందుపరుచుకోవాలి. ఆ తర్వాత వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ.. తగిన సమాచారాన్ని నోట్స్‌‌‌‌‌‌‌‌ రూపంలో రాసుకుంటే పరీక్షలో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది.

అడపా సత్యనారాయణ , టీఎస్​పీఎస్సీ సిలబస్​ కమిటీ మెంబర్