![డోంట్ వర్రీ..ఏఐతో జాబ్స్ పోవు..కొత్త ఉద్యోగాలు వస్తాయి: ప్రధాని మోదీ](https://static.v6velugu.com/uploads/2025/02/history-shows-that-work-does-not-disappear-due-to-technology-says-pm-modi-at-ai-summit_690cXAeOnk.jpg)
- ఏఐతో కొత్త ఉద్యోగాలు..
- పనులు ఏడికీ పోవు.. పద్ధతులు మారుతయంతే: మోదీ
- ఏఐతో జాబ్స్ పోతాయన్న ఆందోళనలు వద్దన్న ప్రధాని
- నేషనల్ ఏఐ మిషన్తో ఇండియా ముందంజ
- పారిస్లో ఏఐ యాక్షన్ సమిట్కు మాక్రన్తో కలిసి అధ్యక్షత
పారిస్:చరిత్రలో ఎప్పుడు కొత్త టెక్నాలజీలు వచ్చినా పని మాత్రం పోలేదని, పని పద్ధతులే మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయని, కానీ ఏఐతో కొత్త జాబ్స్ వస్తాయన్నారు.
మంగళవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ‘ఏఐ యాక్షన్ సమిట్’కు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ తో కలిసి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు.
కానీ టెక్నాలజీతో పని ఎప్పటికీ పోదని చరిత్ర చెప్తోంది. కాలంతోపాటే ఉద్యోగాల స్వభావం మారుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. అయితే, ఉద్యోగాలు కోల్పోవడం అన్న సమస్యను పరిష్కరించాలంటే.. ఏఐతో నడిచే భవిష్యత్తుకు అనుగుణంగా మన ప్రజలకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ నిర్వహించాలి.
ఇందుకోసం మనం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి” అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి భవిష్యత్తును మార్చబోయే ఏఐ యుగంలో మనం మొదటి దశలో ఉన్నాం. మెషీన్లు తెలివితేటల్లో మనుషులను మించిపోతాయని కొందరు భయపడుతున్నారు.
కానీ మెషీన్లు ఎప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాబోవు. మనమంతా కలిసికట్టుగా భవిష్యత్తు కోసం బాధ్యతతో పని చేయాల్సి ఉంది” అని ప్రధాని అభిప్రాయపడ్డారు.
అలాగే అతిశక్తిమంతంగా ఉన్న ఏఐ టెక్నాలజీతో వచ్చే రిస్క్ లను కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ విప్లవంతో తలెత్తుతున్న సైబర్ సెక్యూరిటీ, తప్పుడు సమాచార వ్యాప్తి, డీప్ ఫేక్ వంటి సవాళ్లను కూడా సమష్టిగా ఎదుర్కోవాలన్నారు.
ఏఐ నిర్వహణకు గ్లోబల్ ఫ్రేంవర్క్ ఉండాలి..
రోజువారీ జీవితంలో ఇప్పుడు ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని, ఏఐ టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ, ప్రధానంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా సమానంగా అందాలని మోదీ ఆకాంక్షించారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ ఎలాంటి పక్షపాతాలు లేకుండా నమ్మకమైన, పారదర్శకతతోకూడిన ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ టెక్నాలజీని అందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అన్ని దేశాలు కలిసి ఒక గ్లోబల్ ఫ్రేంవర్క్ రూపొందించుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ అభివృద్ధి కోసం వనరులు, ట్యాలెంట్ ను సమీకరించుకోవాలని సూచించారు.
టెక్నాలజీని డెమోక్రటైజ్ చేయాలని, ప్రజలే కేంద్రంగా ఏఐ అప్లికేషన్లు ఉండాలన్నారు. ‘‘కోట్లాది మంది జీవితాల్లో మార్పును తెచ్చేందుకు ఏఐ దోహదం చేస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సైన్స్ వంటి రంగాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
టెక్నాలజీ అనేది మానవాళికి సమర్థమైన, ఉపయోగకరమైన వనరుగా ఉండాలి. ఇది స్థానిక వ్యవస్థల్లో బాగా అమలులోకి రావాలి” అని చెప్పారు.
ఇండియాలో ఏఐ విప్లవం..
భారత్లో కూడా ఏఐ విప్లవం మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘140 కోట్లకుపైగా ప్రజల కోసం ఇండియా అతి చౌకగానే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించింది. ఎకానమీని ఆధునికీకరించేందుకు, ప్రభుత్వ పాలనను మెరుగుపర్చేందుకు, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అనేక రకాలుగా అమలు చేస్తోంది” అని ఆయన తెలిపారు.
మోదీపై జేడీ వాన్స్ ప్రశంసలు
మోదీ ప్రసంగంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రశంసలు కురిపించారు. ఏఐతో ఉద్యోగాలు పోవని, కొత్త ఉద్యోగాలొస్తాయన్న మోదీ మాటలు నిజమేనన్నారు. ఆర్థిక వృద్ధిలో ఏఐ పాత్ర కూడా కీలకంగా మారుతుందన్నారు.
‘‘ఏఐ పట్ల ప్రధాని మోదీ ఆలోచనలను అభినందిస్తున్నా. ఏఐతో ప్రజలు మరింత ప్రొడక్టివ్ గా మారతారని నేను నమ్ముతున్నా. ఏఐ ఎప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాబోదని భావిస్తున్నా” అని వాన్స్ చెప్పారు.