జాబ్‌ రావాలంటే.. హిస్టరీ చదవాల్సిందే

జాబ్‌ రావాలంటే.. హిస్టరీ చదవాల్సిందే

కేంద్ర ప్రభుత్వ కొలువులతో పాటు గ్రూప్–1, గ్రూప్–2 మొదలుకొని పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్, వీఆర్‌‌‌‌‌‌‌‌వో, పంచాయతీ సెక్రెటరీ పరీక్ష ఏదైనా చరిత్ర నుంచే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. టీఎస్‌‌‌‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌‌‌‌–1, గ్రూప్‌‌‌‌–2 పోటీ పరీక్షల్లో సుమారు 200 మార్కులు తెలంగాణ చరిత్ర–సంస్కృతి–ఉద్యమ నేపథ్యం నుంచే  వస్తున్నాయి. ఇండియన్​ హిస్టరీ నుంచి మరో 50 ప్రశ్నలు అదనంగా రానున్నాయి. ఈ నేపథ్యంలో మిస్టరీ లాంటి హిస్టరీని వ్యూహాత్మకంగా ఎలా ప్రిపేర్​ అవ్వాలి, ఏ టాపిక్స్​ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.. 

అన్ని సబ్జెక్టులతో పోలిస్తే కేవలం హిస్టరీ నుండే గ్రూప్స్​లో దాదాపు 250 మార్కులు రానున్నాయి. పోలీస్​, ఇతర పోటీ పరీక్షల్లో కూడా చరిత్రకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రస్తుత కాంపిటీటివ్ పరీక్షల్లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడిగే విధానంలో మార్పు వచ్చింది. రాజులు, యుద్ధాలు, సంఘటనలు, సమస్యలు కాకుండా ప్రజల జీవన విధానం పట్ల ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు. మారిన ప్రశ్నల స్వభావాల ఫలితంగా ప్రిపరేషన్ ప్లాన్​ కూడా మార్చాలి.

సంస్కృతి
సాధారణంగా మంచి అభిరుచులు, ఉత్తమ పద్ధతులు, నడవడిక, ఉన్నత ప్రవర్తనా సముదాయాన్ని సంస్కృతి అంటాం. దీనిలో భాగంగా రాజులు నిర్మించిన భవనాలు ఉదాహరణకు చౌమహాల్‌‌‌‌ ప్యాలెస్, ఫలక్‌‌‌‌నుమా, కింగ్‌‌‌‌కోఠి, ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి. వారి కాలంలో ఉన్న కట్టడాలు గోల్కొండ కోట, ఓరుగల్లు కోట, చార్మినార్‌‌‌‌, కుతుబ్‌‌‌‌షాహీల సమాధులు, ఉద్యానవనాలు, పెయింటింగ్స్​ అంశాల మీద ఎక్కువ ఫోకస్​ చేయాలి. 

వారసత్వం
ఒక జాతి, ప్రజల ఆచార వ్యవహారాలు, మత పద్ధతులు, జీవన విధానమే సంస్కృతి. ఈ సంస్కృతి వారసత్వంగా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తుంది. సాంఘిక వ్యవస్థ, కళలు, సాహిత్యం, మతం, ఆచార వ్యవహారాలన్నింటిని కలిపి వారసత్వం–సంస్కృతిగా చెప్పవచ్చు. ఈ దశలో అభ్యర్థులు చారిత్రక నేపథ్యం, కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాలు, భాషలు, మాండలికాలు, జాతరలు, పండగలు.. తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలపై దృష్టి కేం ద్రీకరించి.. ముఖ్యంశాలను నోట్‌‌‌‌ చేసుకోవాలి. ఉదా.. చారిత్రక నేపథ్యంలో.. ప్రధానంగా శాసనాలు.. వాటిలోని ప్రధానాంశాల గురించి తెలుసుకోవాలి. కవులు, కళాకారుల గురించి వారి రచనలు, పాటలు గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన జాతరలు అవి జరిగే ప్రాంతాలు. పండగలు వాటి ప్రాముఖ్యతలు, తెలంగాణ మాండలి క పదాలు, కళల ప్రాముఖ్యత వాటిని ప్రోత్సహించిన వారి గురించి నోట్స్​ రూపంలో ముఖ్యమైన పాయింట్స్​ రాసుకొని ప్రిపేర్​ అవ్వాలి. 

తెలంగాణ ఉద్యమం
1948 సంవత్సరంలో హైదరాబాద్‌‌‌‌పై పోలీస్‌‌‌‌ చర్య (గొడ్దార్డ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌). మిలిటరీ పాలనలో ప్రజల తిరుగుబాటు, బూర్గుల రామకృష్ణారావు సారధ్యంలో మంత్రివర్గ ఏర్పాటు (ముల్కీ నిబంధన ఉల్లంఘన వాటి పర్యవసానాలు), 1953లో ఫజల్‌‌‌‌ అలీ సారధ్యంలో రాష్ట్రాల పునర్‌‌‌‌వ్యవస్థీకరణ(ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌సీ) కమిషన్‌‌‌‌ ముఖ్యాంశాలు, సిఫార్సులు ముఖ్యమైనవిగా భావించాలి. 1956 పెద్దమనుషుల ఒప్పందం. తెలంగాణ రక్షణల ఒప్పంద ఉల్లంఘన, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావుల పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

ముల్కీ నేపథ్యం
ముల్కీ ఉద్యమ నేపథ్యం నుంచి 2001 వరకు గల గిర్‌‌‌‌గ్లాని కమీషన్‌‌‌‌ వరకూ.. వాటి మూలాలను చదవాలి. ముఖ్యంగా వివిధ కమిటీలు, హైకోర్టు తీర్పులు, జీవోలు, సుప్రీంకోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం వంటివి అత్యంత కీలకాంశాలు. జీవో నెంబర్‌‌‌‌ 111, జీవో 610, జీవో 564, జీవో నెం 36 ప్రాధాన్యతల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

నక్సలైట్, రైతు కూలీ, గిరిజన పోరాటాలు
నక్సలైట్‌‌‌‌ ఉద్యమం, సామాజిక ఆర్థిక నేపథ్యం.. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, వారితో చర్చలు మొదలైనవి. రైతు కూలి, గిరిజన, ఆదివాసీల తిరుగుబాట్లను.. భారతీయ, తెలంగాణ, సామాజిక నేపథ్యంలోని అంశాలను పరిశీలించాలి. 1980లో వచ్చిన ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులు, తెలుగుజాతి భావనలు, తెలంగాణ ఆత్మగౌరవం, భాషాసంస్కృతులను తెలుసుకోవాలి.

సాంస్కృతిక చరిత్ర
చరిత్ర చదివే క్రమంలో రాజకీయ చరిత్ర, సాంస్కృతిక చరిత్ర అనే కోణాలుండాలి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక అనే విభజనతో చదువుతున్నప్పుడు కాలం ప్రధానంగా పరిగణనలోకి వస్తుంది. అందుకనుగుణంగా అంశాలన్నీ విభజించారు. దీన్నే రాజకీయ సాంస్కృతిక చరిత్ర అన్నప్పుడు అంశాల వారీగా అధ్యయనం చేయాలి. సంస్కృతి అంటే నాటి ఆచార వ్యవహారాలు, జీవనశైలి, కళలు, సాహిత్యం, ఆర్థిక అంశాలు, సాంఘిక నిర్మితులు మొదలైన వాటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి.

రాజకీయ చరిత్ర
సిలబస్​లో రాజకీయ చరిత్ర అని ప్రత్యేకంగా పేర్కొంటే.. వివిధ రాజ్య వంశాల స్థాపన, ఒక్కొక్క రాజవంశంలో పరంపర, చారిత్రకంగా గుర్తు పెట్టుకోదగిన సంఘటనలు, ప్రముఖులైన రాజులు, అనుసరించిన ఆర్థిక విధానాలు మొదలైన అంశాల రూపంలో రాజకీయ చరిత్రను చదవాలి. రాజకీయం అంటేనే అధికారం పొందేందుకు చేసే ప్రక్రియ. ఆ పరంపరలో వివిధ రాజులు తమ అధికారాన్ని పొందేందుకూ, నిలబెట్టుకునేందుకూ ఎటువంటి వ్యూహం అనుసరించారు అనే కోణంలో కారణాలు, ఫలితాలు విశ్లేషించుకుంటూ చదవాలి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర అని మూడు భాగాలుగా చదవాల్సి ఉంటుంది. ఆధునిక చరిత్రలో అంతర్భాగంగానే స్వాతంత్య్ర ఉద్యమాన్ని చూడాలి.  అభ్యర్థులు విభిన్న కోణాల్లో నోట్స్‌‌‌‌ తయారుచేసుకొని వినూత్న ప్రణాళికతో చదివితే విజేతలుగా నిలవొచ్చు. 

తెలంగాణ సంస్కృతి 
తెలంగాణ ప్రజలు అనాదిగా పాటిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలే సంస్కృతి. ఇందులో ముఖ్యంగా శాతవాహనుల నుంచి నిజాం రాజుల వరకూ.. రాజకీయంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా జరిగిన మార్పులను పరీక్ష కోణంలో చదవాలి.  శాతవాహనుల బౌద్దతత్వం, ఇక్ష్వాకుల శిల్పకళా నైపుణ్యం, విష్ణుకుండినుల సామాజిక నిర్మాణం, కాకతీయుల తటాక నిర్మాణాలు, రేచర్ల వెలమరాజుల సాహిత్య పోషణ, (2వ సింగభూపాలుడు తెలంగాణ శ్రీకృష్ణదేవరాయులుగా ప్రసిద్ధి), గోల్కొండ రాజుల తెలుగు సాహిత్య పోషణ. ఫ్రెంచి జాతీయుడు టావెర్నియర్‌‌‌‌.. ఈ రాజ్యాన్ని ఏడు సార్లు సందర్శించినట్లు తన గ్రంథంలో రాసుకున్నాడు. నిజాం రాజులు హైదరాబాద్‌‌‌‌ అభివృద్ధికి చేసిన కృషి, వారు నిర్మించిన కట్టడాల గురించి తెలుసుకోవాలి.  అన్ని జాతులకు, మతాలకు నిలయంగా తెలంగాణ ఎలా నిలిచిందో అవగాహన పెంచుకోవాలి. 

ఉద్యమం–రాష్ట్ర ఏర్పాటు 
టీఆర్​ఎస్​ ఏర్పాటు, ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన  కార్యక్రమాలు, జేఏసీ చేపట్టిన వంటావార్పు, మిలియన్​ మార్చ్​, సకల జనుల సమ్మె లాంటి వినూత్న నిరసనలు.  రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థులు, మేథావులు, వివిధ పార్టీల పాత్ర గురించి ఎగ్జామ్​లో ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది.  క్రోణాలజీ ప్రకారం ప్రిపేర్​ అయితే గుర్తుంచుకోవడం సులువుగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా.. ఉద్యోగాలు మాత్రం వందల్లోనే ఉన్నాయి. సమయం వృథా చేయకుండా ప్రణాళికతో చదివి అనుకున్న కొలువు సొంతం చేసుకునేలా అభ్యర్థులు కృషి చేయాలి.

ఇండియన్​ హిస్టరీ
భారతీయ సంస్కృతి, వారసత్వం, కళారూపాలలో బేసిక్​ నాలెడ్జ్​ అభ్యర్థికి ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రాచీన చిత్రకళలు, గ్రీకు–రోమన్ చిత్రకళలు ప్రభావాలు, మధ్యయుగంలో భారతీయ చిత్రకళలు, చిత్రకళ పరిణామక్రమం మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 

– వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్​