వీటో అధికారం అంటే ఒక బిల్లును ఆమోదించకుండా తిరస్కరించడం అని అర్థం. వీటో అనే పదానికి లాటిన్ భాషలో నిరోధం లేదా తిరస్కారం అని అర్థం. అయితే, భారత రాజ్యాంగంలో వీటో అనే పద ప్రయోగం లేదు. ఈ వీటోలో నాలుగు రకాలు ఉన్నాయి. అవి.. నిరపేక్ష వీటో, తాత్కాలిక వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. భారత రాష్ట్రపతికి మొదటి మూడు వీటో అధికారాలు మాత్రమే ఉన్నాయి. నాలుగో వీటో అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది.
నిరపేక్ష వీటో: ఇందులో భాగంగా రాష్ట్రపతి తన ఆమోదానికి పంపిన బిల్లుకు ఎలాంటి ఆమోదం తెలుపకుండా ఉంటాడు. దీంతో ఆ బిల్లు రద్దవుతుంది. ఇండియాలో ఉపయోగించిన సందర్భాలు
- 1954లో రాజేంద్రప్రసాద్ పాటియాలా ఈస్ట్ ప్రావిన్సెస్ స్టేట్స్ యూనియన్ బిల్లుపై నిరపేక్ష వీటోను ఉపయోగించారు.
- పార్లమెంట్ సభ్యుల వేతనం, అలవెన్స్, పెన్షన్ బిల్లుపై 1991లో రాష్ట్రపతి వెంకట్రామన్ నిరపేక్ష వీటోను ఉపయోగించారు.
సస్పెన్సివ్ వీటో: దీని ద్వారా రాష్ట్రపతి తన ఆమోదానికి పంపిన బిల్లును పున:పరిశీలనకు పంపవచ్చు. తర్వాత అదే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సవరణలు లేదా సవరణలు లేకుండా సాధారణ మెజార్టీతో ఆమోదించి రాష్ట్రపతికి పంపితే రెండోసారి వచ్చినప్పుడు దానిని తప్పనిసరిగా ఆమోదించాలి. అంటే ఈ సందర్భంలో రాష్ట్రపతి వీటోపై పార్లమెంట్ పైచేయి సాధిస్తుంది.
2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం జోడు పదవుల సందర్భంలో లాభదాయక పదవుల విషయంలో సస్పెన్సివ్ వీటోను ఉపయోగించారు. ఈ సందర్భంలో రాష్ట్రపతి బిల్లును ఆమోదించడం గాని తిరస్కరించడం గాని పున:పరిశీలనకు పంపడం గాని చేయడు. వచ్చిన బిల్లును నిరవధికంగా తన వద్దే ఉంచుకుంటాడు. ఒక బిల్లును ఆమోదించడానికి రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఒక నిర్ణీత కాలపరిమితి నిర్ధారించలేదు. కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అదే అమెరికాలో అయితే అధ్యక్షుడు 10 రోజులలోగా ఆమోదించడం గాని పున:పరిశీలనకు పంపవచ్చు.
కాబట్టి భారత రాష్ట్రపతికి ఉన్న ఈ పాకెట్ వీటో అధికారం అమెరికా అధ్యక్షుడి వీటో కంటే విస్తృతమైంది. 1986లో జ్ఞానీ జైల్సింగ్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు (రాజీవ్ గాంధీ ప్రభుత్వం) విషయంలో ఈ పాకెట్ వీటోను ఉపయోగించారు. 1989లో వెంకట్రామన్ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టల్ బిల్లుపై సస్పెన్సివ్ వీటోను ఉపయోగించగా ఆ బిల్లు తిరిగి రాష్ట్రపతికి పంపలేదు.