హిట్ అండ్ రన్​ కేసుల్లో.. ఇద్దరు మృతి

హిట్ అండ్ రన్​ కేసుల్లో..  ఇద్దరు మృతి
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ముషీరాబాద్, వెలుగు: సిటీలో మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన హిట్ అండ్ రన్​ కేసుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నల్లకుంట పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గోల్నాక శాంతినగర్​కు చెందిన కులకర్ణి సిద్ధన్న (70) విద్యానగర్​లోని మనోహర అపార్ట్మెంట్​అజంతా కోపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం సొసైటీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లగా, ప్యాసింజర్ ఆటో అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. బాధితుడిని స్థానికులు తొలుత దుర్గాబాయి దేశ్ ముఖ్​హాస్పిటల్​కు తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

మేడ్చల్: మేడ్చల్ చెక్ పోస్టు వద్ద తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉషప్ప( 40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆంజనేయులు, శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.

చాంద్రాయణగుట్ట: కారు ఢీకొనడంతో పారిశుధ్య కార్మికురాలి పరిస్థితి విషమంగా మారింది. ఉప్పుగూడ భానోదయ సంఘం బస్తీకి చెందిన అండాలమ్మ (45) సంతోష్​నగర్ సర్కిల్​లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున బాబానగర్​లో రోడ్లను శుభ్రం చేస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన షిఫ్ట్ కారు ఆమెను ఢీకొట్టింది. బాధితురాలిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా,  చికిత్స చేసిన వైద్యులు ఆమె కుడికాలు తొలిగించారు. 24 గంటలు గడిస్తే తప్ప పరిస్థితి చెప్పలేమన్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ లో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయా ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.