అబ్దుల్లాపూర్ మెట్ లో హిట్ అండ్ రన్..యువతి మృతి

అబ్దుల్లాపూర్ మెట్ లో హిట్ అండ్ రన్..యువతి మృతి

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడుతో ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టగా ఓ యువతి మృతి చెందింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిల్లపూర్ కు చెందిన కొప్పు స్పందన(19) ఘట్ కేసర్​లోని ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ బీ ఫార్మసీ చేస్తోంది. గురువారం సాయంత్రం సాయి కుమార్ అనే స్నేహితుడితో బైక్​పై కోహెడ నుంచి ఔటర్ వైపు వెళ్తుండగా వెనుక నుంచి ఓవర్​స్పీడుతో వచ్చిన ఓ కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది.

స్పందన అక్కడికక్కడే మృతి చెందింది. సాయి కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని హయత్ నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్పందన తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.