రైతులపైకి మళ్లీ టియర్​గ్యాస్​.. 8 మందికి గాయాలు.. శంభు బార్డర్​ వద్ద ఉద్రికత్త

రైతులపైకి మళ్లీ టియర్​గ్యాస్​.. 8 మందికి గాయాలు.. శంభు బార్డర్​ వద్ద ఉద్రికత్త
  • పంజాబ్​- హర్యానా సరిహద్దుల్లో అడ్డుకున్న పోలీసులు
  • ఢిల్లీకి రాకుండా మల్టీలేయర్​​ బారికేడ్ల ఏర్పాటు
  • 8 మందికి గాయాలు..శంభు బార్డర్​ వద్ద ఉద్రికత్త
  • చలో ఢిల్లీని తాత్కాలికంగా నిలిపేసిన రైతు సంఘాల నేతలు

శంభు(హర్యానా): తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన 101 మందితోకూడిన రైతు బృందంపై హర్యానా పోలీసులు మరోసారి టియర్​గ్యాస్​ ప్రయోగించారు. ఫిరంగులతో వాటర్​జెట్స్​ను వదిలారు. హర్యానా నుంచి పాదయాత్రగా బయలుదేరిన రైతులను పంజాబ్​–హర్యానా బోర్డర్​లోని శంభు వద్ద మల్టీలేయర్డ్​ బారికేడ్లతో అడ్డగించారు. నేషనల్​ క్యాపిటల్​ అడ్మినిస్ట్రేషన్​ అనుమతి ఉన్నవారినే ఢిల్లీలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు. 

అయినా రైతులు ముందుకు కదలగా.. వారిపై భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో అన్నదాతలు తడి జ్యూట్ బ్యాగులు అడ్డుగాపెట్టుకొని, నిలబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది  మంది రైతులు గాయపడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. దీంతో శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.  ఈ నేపథ్యంలో చలో ఢిల్లీ పాదయాత్రను ఒక్కరోజు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం కదం
పంట కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధతతోపాటు ఇతర డిమాండ్లతో సంయుక్త కిసాన్​మోర్చా (నాన్​పొలిటికల్​), కిసాన్​ మజ్దూర్​ మోర్చా సంయుక్తంగా శంభు, కన్నౌరీ బోర్డర్​ వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి ధర్నా చేస్తున్నాయి. గత శుక్రవారం అన్నదాతల బృందం ఢిల్లీకి మార్చ్​ చేపట్టింది.  శంభు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్​గ్యాస్​ ప్రయోగించారు.

ఈ ఘటనలో కొందరు రైతులు గాయపడగా.. పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆదివారం ఉదయం మరోసారి చలో ఢిల్లీ పాదయాత్ర చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు వారిని పోలీసులు మల్టీలేయర్డ్​ బారికేడ్స్, టియర్​గ్యాస్​తో అడ్డుకున్నారు. 

అనుమతి లేనందునే నిలిపేశాం: పోలీసులు 
పాదయాత్ర చేపట్టిన రైతులకు ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్​ నుంచి అనుమతి లేదని అంబాలా పోలీసులు తెలిపారు. 101 మంది రైతుల పేర్లు తమ దగ్గర ఉన్నాయని, వారిని మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. కానీ రైతుల సమూహంలో తమ లిస్ట్​లో లేనివారు కూడా ఉన్నారని, వారి గుర్తింపు కార్డు చూపేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. అందువల్లే టియర్​ గ్యాస్​ ప్రయోగించి అడ్డుకున్నామని చెప్పారు.

జైల్లో రైతుల నిరాహార దీక్ష
జైల్లో ఉన్న గ్రేటర్​నోయిడా రైతులు  డిమాండ్ల పరిష్కారం కోస నిరాహార దీక్ష చేపట్టినట్టు సంయుక్త కిసాన్​ మోర్చా తెలిపింది. ప్రస్తుతం గౌతమ్ బుద్ధనగర్​జిల్లా జైలులో ఉన్న గ్రేటర్​ నోయిడా రైతులు తమ హక్కులు, ప్రయోజనాల కోసం హంగర్​ స్ట్రైక్​కు దిగినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నది.