ఖమ్మం జిల్లా : సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ తో ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రామ గోవిందాపురం గ్రామానికి చెందిన బేతి సురేష్, ముత్తిన వేణులు గంగారం వచ్చి వెళుతుండగా మార్గ మధ్యలో స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న ఆరవ తరగతి విద్యార్థి కరీముల్లాను బైక్ పై ఎక్కించుకొని వెళుతుండగా గంగారం శివారు పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ గోవిందాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.