
- భద్రాద్రి జిల్లా ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా తెలిసిన ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బియ్యం అక్రమంగా తరలిస్తుండగా చూసినందుకు స్టూడెంట్ కు టీసీ ఇచ్చిన ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్మండలం ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. మూడు వారాల కింద స్కూల్ లో తెల్లవారుజామున బియ్యాన్ని వాహనంలో సిబ్బంది అక్రమంగా తరలిస్తున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థి సంతోష్, మరో టెన్త్ క్లాస్ స్టూడెంట్ చూశారు. వాచ్మెన్ చూసి వారి వద్దకు వెళ్లాడు. టెన్త్ క్లాస్ స్టూడెంట్ ను వాచ్ మెన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాదన జరిగింది.
తనతో పాటు సంతోష్ కూడా చూశాడని టెన్త్ స్టూడెంట్ చెప్పాడు. దీంతో వాచ్మెన్ వెళ్లి సంతోష్ ను కొట్టడం ప్రారంభించగా ఎందుకు కొడుతున్నాంటూ ఎదురుతిరిగాడు. అనంతరం తనపై సంతోష్ దాడి చేశాడంటూ వార్డెన్, హెచ్ఎంకు వాచ్మెన్ ఫిర్యాదు చేశాడు. బియ్యం అక్రమ తరలింపు విషయం బయట చెప్తే ఇబ్బందులు వస్తాయని, వాచ్మెన్పై దాడి చేశాడనే ఆరోపణతో విద్యార్థికి హెచ్ఎం టీసీ ఇచ్చి పంపించాడు. దీంతో సంతోష్ తల్లిదండ్రులు వెళ్లి వేడుకున్నా హెచ్ఎం వినలేదు. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
బియ్యం తరలించడాన్ని చూసినందుకే తమ కొడుకుకు టీసీ ఇచ్చి పంపించారని తల్లిదండ్రులు పాయం రాము, సత్యవతి వాపోయారు. గతంలోనూ పాఠశాలలో బియ్యం అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల ఒక స్టూడెంట్ను స్కూల్ సిబ్బంది కొట్టడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రస్తుతం ముల్కలపల్లి మండలం పాత గుండాల పాడుకి చెందిన పాయం సంతోష్‌కు టీసీ ఇచ్చిన విషయమై ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు కలెక్టర్, ఐటీడీఏ పీవో సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కోరారు. పాఠశాలలో జరిగే అక్రమాలపై పీఓ నిఘా పెట్టాలని డిమాండ్చేస్తున్నారు.
హెచ్ ఎం వివరణ
అర్ధరాత్రి ఇద్దరు స్టూడెంట్స్ డార్మెటరీ వైపు వెళ్తుండగా ఎక్కడికి వెళ్తున్నారంటూ వాచ్ మెన్ అడిగినందున పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు రాళ్లతో దాడి చేశారని, అందుకే టీసీ ఇచ్చినట్టు ఆశ్రమ పాఠశాల హెచ్ఎం భీమా తెలిపారు. వాచ్ మెన్ కంటి పైన గాయమైందని, స్టూడెంట్ సంతోష్ తప్పును ఒప్పుకోకపోవడంతోనే టీసీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.