నెన్నెల మండలం కుశ్నపల్లి స్కూల్ హెచ్ఎంపై వేటు 

నెన్నెల మండలం కుశ్నపల్లి స్కూల్ హెచ్ఎంపై వేటు 
  •     ఉరుస్తున్న తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కుశ్నపల్లి జడ్పీ హైస్కూల్​హెచ్ఎం ఠాకూర్​ ఇందర్​సింగ్​పై సస్పెన్షన్​ వేటు పడింది. తరగతి గది ఉరుస్తుండడంతో స్టూడెంట్స్​గొడుగులు పట్టుకొని పాఠాలు వింటున్న ఘటనపై కలెక్టర్​ కుమార్ దీపక్  ​సీరియస్​ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలను గురువారం పరిశీలించారు.

మరో మూడు గదులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోకుండా ఉరుస్తున్న గదిలోనే స్టూడెంట్స్​ను కూర్చోబెట్టి ఉద్దేశపూర్వకంగా విద్యాశాఖను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలు తీయించి వాట్సాప్​ గ్రూపుల్లో వైరల్​ చేయడంలో హెచ్ఎం ప్రమేయం ఉందని భావించి డీఈవో యాదయ్య శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తి అయ్యే వరకు అనుమతి లేకుండా హెడ్​ క్వార్టర్ వదిలి వెళ్లరాదని పేర్కొన్నారు. 

స్టూడెంట్స్​కు ఇబ్బంది లేకుండా చూడాలి

వర్షాలు తగ్గే వరకు స్టూడెంట్స్​కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ​కుమార్ దీపక్​ టీచర్లను ఆదేశించారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన స్పందించి.. స్కూల్​తరగతి గదులను గురువారం పరిశీలించారు. ఉరుస్తున్నాయని తెలిసి కూడా స్టూడెంట్స్​ను అక్కడే ఎందుకు కూర్చోబెడుతున్నారని టీచర్లను ప్రశ్నించారు. స్టాఫ్, ల్యాబ్​రూమ్​లతో పాటు డైనింగ్​ హాల్​లో స్టూడెంట్స్​ను సర్దుబాటు చేయాలన్నారు.

వర్షాలు తగ్గాక మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతవరకు పిల్లలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. అనంతరం పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వార్డెన్ ​లచ్చన్న విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలపడంతో.. ఐటీడీఏ పీవోకు చెప్పి షోకాజ్​నోటీసు ఇప్పిస్తానని వార్డెన్​ను హెచ్చరించారు. అలాగే నెన్నెల ఎంపీడీవో, తహశీల్దార్ ఆఫీస్, పీహెచ్​సీలను ఆయన తనిఖీ చేశారు. ప్రజాపాలన, ధరణి హెల్ప్​డెస్క్​ నిర్వాహణ విధానాన్ని పరిశీలించారు.