- 131 ఎకరాల్లో లేఅవుట్స్ కు హెచ్ఎండీఏ సన్నాహాలు
- రైతుల నుంచి భూములను సేకరిస్తున్న అధికారులు
- లేమూరులో 96, యాలాల్ లో 88 ఎకరాలు సేకరించాలని నిర్ణయం
- హెచ్ఎండీఏ ఖాజనాను నింపేలా సిటీ శివారులో ప్రాజెక్టులు
హైదరాబాద్, వెలుగు : మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్స్ వేస్తోంది. ఇందుకోసం రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూమిని సేకరిస్తోంది. డెవలప్‌చేసి, భూ వేలం ద్వారా ఖజానా నింపుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిటీ శివారులోని ఉప్పల్‌భగాయత్ భూములను వేలం వేసి, భారీగా ఆదాయం పొందింది. తాజాగా ప్రతాపసింగారంలో ల్యాండ్‌పూలింగ్‌కు శ్రీకారం చుట్టింది. లేఅవుట్స్ నోటిఫికేషన్జారీచేసి, ఆసక్తిగల రైతులు భూములు ఇవ్వాలని కోరింది. ఇక్కడ మొత్తం131 ఎకరాలను సేకరించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ లేఅవుట్స్తీసుకునేందుకు రియల్టర్లు, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులు తమ భూములను ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. లేఅవుట్స్వేస్తే తమ భూములకు రెక్కలు వస్తాయని రైతులు భావిస్తున్నారని, ఇప్పటికే కొందరి నుంచి భూమిని సేకరించామని తెలిపారు.
రైతుకు 1,742 గజాల భూమి..
ఉప్పల్‌భగాయత్‌లో లేఅవుట్స్అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులకు, ఎకరానికి వెయ్యి గజాల అభివృద్ధి చేసిన భూమిని ఇచ్చారు. కొందరికి పరిహారం ఇచ్చారు. ప్రతాపసింగారంలో పరిహారంతోపాటు ఎకరానికి 1,742 గజాల అభివృద్ధి చేసిన భూమిని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆఫర్‌తో ఎక్కువ మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. సేకరించిన భూములను అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్లాట్లు వేస్తారు. ఈసారి సామాన్య, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని 150, 200, 300, 400, 500 గజాల సైజుల్లో ప్లాటింగ్ చేయాలని నిర్ణయించినట్లు హెచ్ఎండీఏలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా భూములు కొనుక్కునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆశించిన స్థాయిలో వేలం జరిగితే హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం రానుంది.
తర్వాత రంగారెడ్డి జిల్లాలో..
ప్రతాపసింగారంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్సక్సెస్అయితే, ఆ వెంటనే మరికొన్ని చోట్ల భూములు సేకరించాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా లేమూరులో 96 ఎకరాలు, యాలాల్లో 88 ఎకరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక రైతుల నుంచి వచ్చే స్పందన బట్టి, ఆయా ప్రాంతాల్లో లేఅవుట్స్వేయాలని అధికారులు చూస్తున్నారు. ప్రతాపసింగారం, లేమూరు, యాలాల్లో అన్నివర్గాలకు అందుబాటులో ఉంటేలా ప్లాట్లు డెవలప్చేయాలని ప్రయత్నిస్తున్నారు.