- నిరుడుతో పోలిస్తే బాగా పెరిగింది
- రియల్ ఎస్టేట్ తగ్గిందన్నప్రచారం అవాస్తవమని వెల్లడి
- విదేశీ పెట్టుబడులు పెరిగినయ్:జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
- ఆఫీస్ లీజుకు ఇచ్చే విషయంలో రికార్డు సాధించామని వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ తగ్గలేదని, గతంతో పోలిస్తే పెరిగిందని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. హెచ్ఎండీఏ ఆఫీస్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులతో కలిసి ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ‘‘నిరుడుతో పోలిస్తే హైదరాబాద్ లో ఈ ఏడాది రియల్ ఎస్టేట్ సెక్టార్ వృద్ధి చెందింది. బిల్డింగ్‌లతో పాటు లే అవుట్ల పర్మిషన్ల సంఖ్య పెరిగింది. ఆఫీస్ స్పేస్ అక్యుపెన్సీ పెరిగింది. రెసిడెన్షియల్ సేల్స్‌లో వృద్ధి సాధించాం.
డెవలప్మెంట్ కోసం నిరుడు జులై నుంచి నవంబర్ దాకా 1,326 అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది 1,920 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 45శాతం అప్లికేషన్లు పెరిగినయ్. భవన నిర్మాణాల కోసం గతేడాది జులై నుంచి నవంబర్ దాకా 756 అప్లికేషన్లు వస్తే.. ఈ ఏడాది 1,061కు పెరిగినయ్. 40శాతం వృద్ధి కనిపించింది. అక్యుపెన్సి సర్టిఫికెట్ల కోసం నిరుడు ఐదు నెలల్లో 467 అప్లికేషన్లు వస్తే.. ఈఏడాది 560 వచ్చినయ్. లే అవుట్లలో ఇండ్ల నిర్మాణం, ఓపెన్ ప్లాట్ల లే అవుట్, ఫైనల్ లే అవుట్ల అప్లికేషన్లు గతేడాది జులై నుంచి నవంబర్ దాకా 103 వస్తే.. ఈ ఏడాది అదే టైమ్‌లో 299 వచ్చాయి. అనుమతుల కోసం వచ్చిన అప్లికేషన్లను స్పీడ్‌గా క్లియర్ చేస్తున్నం’’అని సర్ఫరాజ్ తెలిపారు.
అన్ని విధాలుగా పుంజుకున్నం
కొత్తగా డెవలప్ చేసే ప్రాజెక్టులకు సంబంధించి నిరుడు ఒక్క నవంబర్‌లో 267 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది నవంబర్‌లో 399 అప్లికేషన్లు వచ్చాయని సర్ఫరాజ్ తెలిపారు. ‘‘కొత్త భవన నిర్మాణ అనుమతుల కోసం గతేడాది నవంబర్‌లో 149 అప్లికేషన్లు వస్తే.. ఈ ఏడాది 228 వచ్చాయి. ఇలా అన్ని విధాలుగా చూసుకున్నా.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీగానే పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నదే తప్ప.. పడిపోలేదు’’అని సర్ఫరాజ్ తెలిపారు.
ఆరు నెలల్లో రూ.58వేల కోట్ల బిజినెస్: ఇలంబర్తి
ఇన్వెస్టర్లకు గమ్య స్థానంగా తెలంగాణ నిలిచిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. ‘‘విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పొందుతున్న దేశంలోని మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఐదేండ్లను మించాయి. ఈ వ్యవధిలో రూ.58,481 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ ఏడాది జూన్‌లో రూ.4,288 కోట్ల విలువైన నివాస యోగ్యమైన ఆస్తుల అమ్మకాలు జరిగాయి.
2.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు ఇచ్చి రికార్డు సాధించినం. 2023తో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించాం. రూ.7,032 కోట్ల అంచనాలతో 38 ప్రాజెక్టులు రానున్నాయి. దశలవారీగా మొత్తం నాలుగు ఫేజ్‌లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి హైదరాబాద్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. జీఆర్ఎంపీ ఫేజ్ 2 కింద రూ.3,825 కోట్లతో 1,143 కిలో మీటర్ల 934 రోడ్లను మెయింటెనెన్స్ కోసం అప్పగిస్తాం. ఎస్ఎన్డీపీ ఫేజ్ 2 కింద రూ.667 కోట్ల అంచనాలతో 40 పనులు చేపట్టినం. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, కాలనీ పార్కులను గుర్తించి వాటికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నం. త్వరలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణ టెండర్లు వేస్తాం’’అని ఇలంబర్తి తెలిపారు.