ఫార్ములా ఈ కార్ రేస్ కేసు : విచారణకు రమ్మంటే.. రాకుండా ఎగ్గొట్టిన BLN రెడ్డి

ఫార్ములా ఈ కార్ రేస్ కేసు : విచారణకు రమ్మంటే.. రాకుండా ఎగ్గొట్టిన BLN రెడ్డి

ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారనకు BLN రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు మరి కొంత సమయం కావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ ద్వారా లేఖ పంపారు. BLN రెడ్డి అభ్యర్థనపై ఈడీ సానుకూలంగా స్పందించింది. మరోరోజు విచారణకు పిలుస్తామని బీఎల్ ఎన్ రెడ్డికి ఈడీ  సమాధానం పంపింది.  

ఫార్ములా- ఈ రేస్‌ కేసులో HMDA మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఈడీ విచారణ కు గురువారం (2 జనవరి 2025) కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. తదుపరి విచారణ ఎప్పుడనేది చెబుతామని ఈడీ జాయింట్ డైరెక్టర్ సమాధానం పంపారు.

ఇక ఇదే కేసులో శుక్రవారం అరవింద్‌కుమార్‌ విచారణకు హాజరుకానున్నారు.  ఇక జనవరి 7న మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ జరగనుంది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాల సేకరించిన అధికారులు గురువారం నుంచి విచారణను వేగవంతం చేయనున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ఏసీబీ కీలక పత్రాలను ఈడీకి అప్పగించిన విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండానే రూ.55 కోట్లు కేటాయించడంపై ప్రభుత్వం ఏసీబీ విచరాణకు అనుమతించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌‌‌ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్(ఎమ్‌‌‌‌ఏయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ సమక్షంలోనే నిధులు దారిమళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

  అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ టైమ్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. అప్పటి మంత్రి కేటీఆర్ ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించారని కేటీఆర్‎పై అభియోగాలు మోపింది. ఈ కేసులో ఈడీ జనవరి 2 నుంచి విచారణ వేగవంతం చేసింది. వరుసగా అధికారులను విచారించనుంది.