ఆమ్దానీపై హెచ్‌‌ఎండీఏ ఫోకస్‌

ఆమ్దానీపై హెచ్‌‌ఎండీఏ ఫోకస్‌
  • లేఅవుట్లు చేసి వేలం వేయాలన్న ఆలోచనలో ఆఫీసర్లు
  • ప్రభుత్వ భూములతో పాటు రైతుల నుంచీ సేకరించేందుకు చర్యలు
  • ఇబ్రహీంపట్నం పరిధిలోని గ్రామాల్లో 1,100 ఎకరాలు సేకరించాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు హెచ్‌‌ఎండీఏ కసరత్తు ప్రారంభించింది. గ్రేటర్‌‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని వేలం వేయడం ద్వారా ఇన్‌‌కం పెంచుకోవాలని ప్లాన్‌‌ చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌‌ పరిధిలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనులను ఆఫీసర్లు మొదలు పెట్టారు. హెచ్‌‌ఎండీఏకు చెందిన భూములపై ఇప్పటికే రిపోర్ట్‌‌ను రెడీ చేసిన ఆఫీసర్లు అందుకు తగ్గట్లుగా వాటిలో లేఅవుట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్‌‌ భూములు సైతం...

బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో భూముల వేలం ద్వారానే హెచ్‌‌ఎండీఏ భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకుంది. బుద్వేల్, కోకాపేట, ఉప్పల్‌‌ భాగాయత్‌‌, బాచుపల్లి, హయత్‌‌నగర్‌‌, తొర్రూరు, మేడిపల్లి, బోడుప్పల్‌‌ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వేలం వేసింది. అలాగే ల్యాండ్‌‌ పూలింగ్‌‌ పద్ధతిలో ఉప్పల్‌‌ భాగాయత్‌‌లోనూ లేఅవుట్లు చేసి వేలం వేసింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించారు.

అందులో భాగంగానే భూముల గుర్తింపునకు హెచ్‌‌ఎండీఏ సిద్ధమైంది. సీఎం రేవంత్‌‌రెడ్డి సైతం ఇటీవల హెచ్‌‌ఎండీఏ ఆఫీసర్లతో మీటింగ్‌‌ నిర్వహించి ఆదాయ పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ భూములను గుర్తించడంతో పాటు, రైతులు, ఇతరుల నుంచి కూడా భూమిని సేకరించి, డెవలప్‌‌ చేసి వేలం వేయడం ద్వారా ఇన్‌‌కం పెంచుకోవాలని చెప్పారు. 

ఇప్పటికే నోటిఫికేషన్‌‌ జారీ

సాధారణంగా హెచ్‌‌ఎండీఏ లేఅవుట్లకు బిల్డర్లు, రియల్‌‌ వ్యాపారుల నుంచి డిమాండ్‌‌ భారీగా ఉంటుంది. అలాగే అన్ని పర్మిషన్లు పొంది, నిబంధనలు పాటించే హెచ్‌‌ఎండీఏ అప్రూవ్డ్‌‌ లేఅవుట్‌‌లో కొనేందుకు ప్రజలు సైతం ఆసక్తి చూపుతుంటారు. దీంతో కీసర మండంలోని భోగారం, పటాన్‌‌చెరు, ప్రతాప సింగారం వంటి ప్రాంతాల్లో రైతుల నుంచి భూములను సేకరించేందుకు హెచ్‌‌ఎండీఏ నోటిఫికేషన్‌‌ జారీ చేసింది.

తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో భూ సేకరణ చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా హెచ్‌‌ఎండీఏ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని భూములను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి పక్కా ప్రణాళికతో భూ సేకరణ చేసి లే అవుట్‌‌లు వేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

కొత్తగా ఇబ్రహీంపట్నం పరిధిలో భూ సేకరణ

తాజాగా ఇబ్రహీంపట్నం పరిధిలోని పలు గ్రామాల్లో భూసేకరణకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో  భాగంగా ఇబ్రహీంపట్నం, కుర్మల్‌‌గూడ, దండుమైలారం, కొర్రొముల, లేమూరు, నాదర్‌‌గుల్‌‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 1,100 ఎకరాల భూసేకరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూ సేకరణకు సంబంధించి ఆయా గ్రామాల్లోని రైతులను, ప్రైవేట్​వ్యక్తులతో ఆఫీసర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఉప్పల్​భాగాయత్‌‌

ప్రతాపసింగారం తదితర ప్రాంతాల్లో 250 ఎకరాలను గుర్తించినట్టు సమాచారం. భూములను సేకరించిన తర్వాత వాటిని లే అవుట్లు వేసి 60: 40 నిష్పత్తిలో వేలం వేస్తారు. అంటే 60 శాతం భూమిని రైతులకు ఇచ్చి మిగిలిన 40 శాతాన్ని హెచ్‌‌ఎండీఏ తీసుకుంటుంది. వీటిని వేలం వేయడం ద్వారా ఇన్‌‌కం సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు హెచ్‌‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.