నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్‌లోని 7వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హుస్సేన్ సాగర్ లోని వినాయక నిమజ్జనాల వ్యర్థాలను హెచ్ఎండీఏ అధికారులు తొలగిస్తున్నారు. విగ్రహాల డెబ్రిస్​ను మూడు రోజులుగా వెలికి తీసి డంపింగ్ యార్డుకు పంపుతున్నారు. బుధవారం 5,500 మెట్రిక్ టన్నులు, గురువారం 726 మెట్రిక్ టన్నులు, శుక్రవారం 801 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇప్పటివరకు హుస్సేన్​సాగర్​నుంచి మొత్తం 7,027 టన్నులను తొలగించారు. 

వాటిని లోయర్ ట్యాంక్ బండ్ లోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డుకు, అక్కడి నుంచి జీహెచ్ఎంసీ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావడంతో రీసైక్లింగ్ చేసేందుకు వీలు ఉండదని, ల్యాండ్ సీలింగ్(భూమిలో కప్పడం) తప్ప వేరే మార్గం లేదని ఓ జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. 15 ఏళ్ల పాటు ల్యాండ్ సీలింగ్ చేస్తే భూమిలో కలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏటా ఇదే ప్రాసెస్ చేస్తున్నట్లు చెప్పారు.  

బడా గణేశ్ వ్యర్థాల వెలికితీత

ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం తరువాత శుక్రవారం విగ్రహానికి సంబంధించిన వ్యర్థాలను వెలికితీశారు. 55 టన్నుల మట్టి విగ్రహం కావడంతో పూర్తిగా కరిగిపోవడానికి నాలుగు రోజులు పట్టింది. కేవలం ఐరన్ మాత్రమే మిగిలింది. ఏటా ఈ ఐరన్ ని  ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు తీసుకెళ్తారు. ఈసారి కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసుకెళ్లారు.