హెచ్‪ఎండీఏ పర్మిషన్లు ఈజీ..పెరిగిన రిజిస్ట్రేషన్లు

హెచ్‪ఎండీఏ పర్మిషన్లు ఈజీ..పెరిగిన రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్,వెలుగు :  గ్రేటర్ సిటీలో రియల్​ఎస్టేట్​ బిజినెస్ భారీగా పెరుగుతోంది. రోజురోజుకు అవుతున్న రిజిస్ట్రేషన్లే దీన్ని సూచిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచే రియల్​ ఎస్టేట్​ పుంజుకుంది. దీంతో  భారీ నిర్మాణాలు, వెంచర్లు, లే అవుట్​ పర్మిషన్లకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్టు హెచ్​ఎండీఏ అధికారులు తెలిపారు. గతేడాది రియల్​ ఎస్టేట్​ స్తబ్దుగా కొనసాగింది. హెచ్​ఎండీఏలో కూడా అనుమతుల జారీ లేట్ అయింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రూల్స్ ఈజీ చేయడంతో రియల్టర్లకు కొంత ఊరట కలిగింది.

మరోవైపు రెరా మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారం వెలుగులోకి రాగా పర్మిషన్ల జారీని కొద్ది రోజులు నిలిపివేశారు. తాజాగా సిటీలో రియల్​ఎస్టేట్​ అభివృద్ధితో పాటు ప్రభుత్వ ఖజానాకు ఇన్ కమ్  పెంచుకునే మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. దీంతో రియల్​ బిజినెస్ మార్కెట్​ ఒక్కసారిగా ఊపందుకుని క్రయ విక్రయాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు కూడా ఎక్కువ అయ్యాయి. గతేడాదితో పోల్చితే నాలుగు నెలల్లోనే రిజిస్ట్రేషన్లలో 15 శాతం పెరిగిందని నైట్​ఫ్రాంక్​ సంస్థ తాజాగా తన నివేదికలో వెల్లడించింది.  దీంతో భవిష్యత్ లో ధరలు పెరిగే చాన్స్ ఉందనే నేపథ్యంలో ఇప్పుడే భూములు, ఇండ్లను భారీగా కొనుగోలు చేస్తున్నట్టు కూడా ఆ సంస్థ పేర్కొంది. 

  కొనుగోలుదారుల ఇంట్రెస్ట్ 

సిటీ పరిధిలో రిజిస్ట్రేషన్లు పెరుగుతుండగా.. వచ్చే రోజుల్లోనూ మరింతగా పెరిగే చాన్స్ ఉందని రియల్​ఎస్టేట్ ​నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈఏడాది జనవరి నుంచి ఏప్రిల్​ నాటికి 26,027  రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 22,632,  అంతకు ముందు ఏడాది 2022లోనూ నాలుగు నెలల్లో 24,866  రిజిస్ట్రేషన్లు అయినట్టు నైట్​ ఫ్రాంక్​ సంస్థ వెల్లడించింది. రియల్​ ఎస్టేట్​ ఫురోగతికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీ పర్మిషన్ల జారీని స్పీడప్ చేయడం కూడా కారణమని ఎక్స్ పర్ట్స్ పేర్కొంటున్నారు.

ప్రభుత్వం కూడా భూముల ధరలు, రిజిస్ట్రేషన్​ చార్జీలను మరోసారి సవరించాలని భావిస్తోంది. దీంతో కొద్దిరోజుల్లోనే వీటి ధరలు పెరగనున్నట్టు సమాచారం. దీంతో చాలామంది భూములు, ఇండ్లను, ఫ్లాట్లను కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తద్వారా హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల పరిధిలో ప్రస్తుతం రియల్​ ఎస్టేట్​ జోరుగా సాగుతోంది. భారీ నిర్మాణాలు, లే అవుట్లకు హెచ్​ఎండీఏకు రెండు నెలల కిందటి వరకు నెలకు 150 – 200  అప్లికేషన్లు రాగా..  ప్రస్తుతం 250 – 300  వస్తున్నట్టు అధికారులు తెలిపారు.
 
ఇండ్ల విస్తీర్ణంలోనూ కీలకంగా.. 

రిజిస్ట్రేషన్లలో ఇండ్ల విస్తీర్ణం కూడా కీలకంగా మారింది.  ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా అవుతుండడం గమనార్హం. దీంతో గతం కంటే 4 – 5 శాతం అదనంగా పెరిగినట్టు రియల్​ ఎస్టేట్​ వర్గాలు తెలిపాయి. 2 వేల నుంచి 3  వేల చ.అ. విస్తీర్ణం కలిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్​ 8 –11 శాతం పెరిగింది.  వెయ్యి నుంచి రెండు వేల చ.అ. విస్తీర్ణంలోని ఇండ్లకు 69 శాతం నుంచి 70 శాతం పెరిగినట్టు నైట్​ఫ్రాంక్​ సంస్థ వెల్లడించింది. కాగా 1000 చ.అ. లోపు విస్తీర్ణం కలిగిన ఇండ్లకు మాత్రం 20 నుంచి 16 శాతం తగ్గినట్టు తెలిపింది. గతేడాది ఏప్రిల్​ నాటికి మేడ్చల్​ జిల్లాలో రిజిస్ట్రేషన్ల వాటా 46 శాతం ఉంటే,  ఈ ఏడాది 39 శాతానికి పడిపోయింది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం 39 నుంచి 45 శాతం పెరిగింది.

50 లక్షలలోపు ఇండ్ల రిజిస్ట్రేషన్​ విలువ ఉన్నవి నాలుగు నెలల వ్యవధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి 4 శాతం తగ్గుదల ఉంది. 2023లో 16,060 రిజిస్ట్రేషన్లు కాగా, ఈ ఏడాది 15,419 అయినట్టు వివరించింది.  50 లక్షల నుంచి రూ. కోటి విలువైన ఇండ్లు 2023లో 4,512 రిజిస్ట్రేషన్లు జరిగితే 2024లో ఇప్పటివరకూ 6,649 జరిగాయి. ఇది 49 శాతం పెరిగింది.  రూ.  కోటి పైన విలువైన ఇండ్ల రిజిస్ట్రేషన్​లో రెట్టింపు పెరుగుదల కనిపించింది. 2023లో 2,060 రిజిస్ట్రేషన్లు జరిగితే ఈఏడాది 3,959 రిజిస్ట్రేషన్లు జరిగి 92 శాతం పెరుగుదల కనిపించింది.