
- రేడియల్ రోడ్లకు రెండువైపులా నిర్మాణం
- రైతుల నుంచి భూసేకరణకు నిర్ణయం
- ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ను కలిపేలా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు
- ప్రణాళికలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ
హైదరాబాద్‌సిటీ, వెలుగు:నగరం శరవేగంగా గ్రేటర్ పరిధి దాటి ఓఆర్ఆర్వరకూ విస్తరిస్తోంది. తాజాగా హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్ఆర్వరకూ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విస్తరిస్తున్న సిటీ అవసరాలకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్మధ్య సకల సౌకర్యాలతో భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్లాన్వేస్తోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, ట్రాన్స్‌పోర్టేషన్, కరెంట్, డ్రింకింగ్‌వాటర్, పార్కులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధమవుతున్నది.
రైతుల నుంచి భూసేకరణ..
ముందుగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌సిటీకి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు హెచ్ఎండీఏ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రైతుల నుంచి భారీ ఎత్తున భూ సేకరణ చేయాలని నిర్ణయించింది. భూసేకరణ తర్వాత వాటిలో లేఔట్లు వేసి 60 శాతం ప్లాట్లను తిరిగి రైతులకు ఇవ్వాలని భావిస్తోంది. మిగిలిన 40శాతం ఏరియాలో టౌన్‌షిప్‌లు కట్టి భారీగా ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా కొన్ని ప్లాట్లు చేసి విక్రయించాలని ప్లాన్చేస్తోంది.
ఇప్పటి వరకూ ఉప్పల్‌భగాయత్, కోకాపేట, బుద్వేల్, మోకిల, బాచుపల్లి, హయత్‌నగర్‌లో హెచ్ఎండీఏ వేసిన లేఔట్లకు మంచి డిమాండ్వచ్చి హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కొన్ని టౌన్షిప్లకు కూడా మంచి గిరాకీ వచ్చింది. అందుకే, కొత్త ప్లాన్‌లో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్మధ్య ఫ్యూచర్‌సిటీని అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించనున్నది. వీటి నిర్మాణానికి టెండర్లను కూడా పిలిచింది.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ల నుంచి..
ఓఆర్ఆర్నుంచి ట్రిపుల్ఆర్ను కలుపుతూ నిర్మించాలనుకుంటున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్రోడ్లను 41.50 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మొదటిదశలో రూ.1665 కోట్లతో 19.20 కి.మీ., రెండో దశలో 2,365 కోట్లతో 22.30 కి.మీ నిర్మించనున్నారు. ఓఆర్ఆర్13 నంబర్ఎగ్జిట్ పాయింట్ రావిర్యాల నుంచి ఫ్యూచర్‌సిటీ మీదుగా కొంగర కుర్ధు, కొంగర కలాన్, మీర్ఖాన్పేట. ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మీదుగా ఆకుతోటపల్లి వరకూ ట్రిపుల్ఆర్ను కలుపుతూ నిర్మించనున్నారు.
ఈ ప్రాంతాల్లోనే రేడియల్ రోడ్లను ఆనుకుని టౌన్‌షిప్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తర్వాత ఆ స్థాయిలో నాలుగో నగరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్‌ద్వారా భూములు సేకరించనున్నారు. ఈ భూముల్లో ఎడ్యుకేషనల్ఇన్స్టిట్యూషన్స్, రోడ్లు, పబ్లిక్‌ట్రాన్స్‌పోర్ట్, పార్కులు, కమర్షియల్కాంప్లెక్సుల నిర్మాణాలకు 353 ఎకరాలు కేటాయించనున్నారు. రెండో దశలో 171 ఎకరాల్లో ఇండ్ల కోసం భూములను కేటాయించనున్నారు.