యాదాద్రి జిల్లాలో హెచ్ఎండీఏ రియల్ ఎస్టేట్!

  • ప్రైవేట్​ భూముల కోసం రెవెన్యూ ఆఫీసర్లతో సంప్రదింపులు

యాదాద్రి, వెలుగు: ప్రభుత్వ ఖజానాను నింపేందుకు హెచ్ఎండీఏ(హైదరాబాద్​మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​అథారిటీ) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు తన ఆధీనంలోని భూములను వెంచర్లు చేసి అమ్ముతుండగా, ఇప్పుడు కమీషన్ కోసం ప్రైవేట్​భూములను వెంచర్లు చేసి అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోంది. జిల్లాల పునర్విభజన, యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణం, గ్రేటర్​హైదరాబాద్​కు సమీపంలో ఉండటంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకుంది. భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. కరోనా, కొన్ని ఇతర కారణాలతో ఈ ప్రాంతంలో బిజినెస్ కొంత తగ్గినప్పటికీ.. భూముల రేట్లు ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాలో ఏ మూలకు వెళ్లినా ఎకరా రూ.25 లక్షలకు పైనే పలుకుతోంది. నేషనల్​హైవేల సమీపంలో ఎకరా భూమి రూ.2 కోట్లకు పైగా, జిల్లా హైవేల పక్కన రూ.కోటికి పైగా ఉంది. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ ఆఫీసర్ల దృష్టి యాదాద్రి భూములపై పడింది. ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించి, డెవలప్ చేసి బిజినెస్​చేయాలని చూస్తున్నారు.

డెవలప్​ చేసినందుకు 40 శాతం

ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన భూమిని పీపీపీ పద్ధతిలో హెచ్ఎండీఏ డెవలప్​చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓనర్​కు 60 శాతం ఇచ్చి, డెవలప్ ​చేసినందుకు 40 శాతం భూమిని హెచ్ఎండీఏ తీసుకుంటుంది. హెచ్ఎండీఏ, డీటీసీపీ రూల్స్​ప్రకారం ఒక ఎకరాన్ని డెవలప్​చేస్తే అంటే రోడ్లు తదితరాల ఏర్పాటు కోసం భూమి పోను 2,800 గజాల భూమి మిగులుతుంది. ఇందులో 60 శాతం అంటే 1,600 గజాల భూమిని ఓనర్​కు ఇస్తారు. 40 శాతం అంటే 1,200 గజాలను హెచ్ఎండీఏ తీసుకుంటుంది. భూమిని హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకోగానే.. ఆ భూమిని ఎవరికీ అమ్మకుండా నిషేధిత జాబితాలో చేరుస్తారు.

4.80 లక్షల గజాలు

హెచ్ఎండీఏకు ఎకరానికి 1200 గజాలు వస్తే.. 400 ఎకరాలకు గాను 4.80 లక్షల గజాల  భూమి వస్తుంది. మారుమూల గ్రామాల్లో కూడా గజానికి రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన అనుకున్న ప్రకారం 400 ఎకరాలు సేకరించి డెవలప్​చేస్తే హెచ్ఎండీఏకు రూ.480 కోట్ల ఇన్​కం వస్తుంది. భూ సేకరణ విషయంలో రైతులను మోటివేట్ చేయాలని హెచ్ఎండీఏ తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిటైర్ట్​తహసీల్దార్​రామచంద్రయ్య రెవెన్యూ ఆఫీసర్లను కోరినట్టుగా తెలిసింది. అయితే బహిరంగ మార్కెట్​లో ధరలు ఎక్కువగా ఉండడంతో హెచ్ఎండీఏకు ఎంత మేర జనం భూములు ఇస్తారో చూడాలి.

పీపీపీ పద్ధతిలో అభివృద్ధి

జిల్లాలో 400 నుంచి 500 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించాలని హెచ్ఎండీఏ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పీపీపీ(పబ్లిక్‌‌ ప్రైవేట్‌‌పార్ట్‌‌నర్‌‌ షిప్‌‌) పద్ధతిలో భూములను డెవలప్​చేస్తారని సమాచారం. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి, వలిగొండ మండలం దుప్పల్లి(గతంలో ఆత్మకూర్ (ఎం) మండలంలో ఉండేది) పరిసరాల్లోని భూములపై అధికారులు ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. నల్గొండ- భువనగిరి రోడ్డుతోపాటు రైల్వేలైన్ పక్కనే నాగిరెడ్డిపల్లి, దుప్పల్లి సమీపంగా కొత్తగా హైదరాబాద్​నుంచి తొర్రూరుకు ఫోర్​వే నిర్మిస్తున్నారు. పైగా ఈ రెండు గ్రామాలు విజయవాడ, వరంగల్​ నేషనల్ హైవేల మధ్య ఉన్నాయి. భువనగిరికి నాగిరెడ్డిపల్లి11కిలోమీటర్ల దూరంలో ఉండగా, అక్కడి నుంచి దుప్పల్లి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి భూమిని సేకరించి డెవలప్​చేస్తే బిజినెస్ బాగా జరుగుతుందని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఈ రెండు గ్రామాల సమీపంలో భూమిని సేకరించడానికి రెవెన్యూ ఆఫీసర్లను సంప్రదించినట్లు తెలుస్తోంది.