హైదరాబాద్లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..

హైదరాబాద్లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి  హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
  • భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ !
  • గతంలో వేలం పాటల్లో మిగిలిన  ప్లాట్లను అమ్మాలని నిర్ణయం
  • కొత్తగా మరికొన్ని చోట్ల లేఅవుట్స్
  • వెయ్యి ఎకరాల వేలానికి సన్నాహాలు
  • మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా.. 
  • భారీగా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో భూముల వేలానికి హెచ్ఎండీఏ మరోసారి సిద్ధమవుతున్నది. మరికొన్ని కొత్త లేఅవుట్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్ఎస్​సర్కారు భారీ ఎత్తున భూముల వేలం వేసింది. తద్వారా హెచ్ఎండీఏ రూ. 2 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది.

కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్ఎండీఏ ప్లానింగ్​ఆఫీసర్​శివబాలకృష్ణ భారీ ఎత్తున అవినీతి చేశాడని తేలడంతో ఆయనపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. దీంతో కొత్త పర్మిషన్లు, భూముల వేలం నిలిపివేశారు. మూడునెలలుగా సిటీలో రియల్​ఎస్టేట్​మళ్లీ పుంజుకోవడంతో భారీ సంఖ్యలో నిర్మాణదారులు అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్త వెంచర్లు కూడా వస్తున్నాయి. 

ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో అధికారులు గతంలో వేసిన లేఅవుట్లలో మిగిలిన భూములతోపాటు, మరికొంత ప్రభుత్వ భూమి, ఇంకొంత భూమి ల్యాండ్​పూలింగ్​ద్వారా సేకరించి వేలానికి సిద్ధమవుతున్నది. ప్రభుత్వం నుంచి గ్రీన్​సిగ్నల్​వచ్చాక ముందుకు వెళ్లాలని చూస్తున్నది.
 
వెయ్యి ఎకరాల వరకూ..
హెచ్ఎండీఏ కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతోంది. ఇందులో ఎలివేటెడ్​ కారిడార్​తో పాటు, త్వరలో ఓఆర్ఆర్​నుంచి ట్రిపుల్ఆర్​వరకు గ్రీన్​ఫీల్డ్​రోడ్లను సైతం నిర్మించబోతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో భూముల వేలంలో మిగిలిన భూములను మళ్లీ వేలం వేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. గతంలో లే ఔట్లు వేసిన ఉప్పల్​ భగాయత్​లో 70 ఎకరాల వరకు మిగిలి ఉన్నట్టు సమాచారం. 

కోకాపేటలో 50 నుంచి 70 ఎకరాలు, బుద్వేల్​లో 50 ఎకరాలు మిగిలినట్టు తెలిసింది. అలాగే బాటసింగారం, ప్రతాప సింగారం, కొంగరకలాన్, ముత్తంగి తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇన్ముల్​నెర్వ, మేడ్చల్​ జిల్లా పరిధిలోని భోగారంతో పాటు ప్రతాప సింగారం, లేమూరు ప్రాంతాల్లో 500 ఎకరాలను ల్యాండ్​పూలింగ్​ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. 

ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్​మధ్య చౌటుప్పల్​ పరిధిలోని దండు మల్కాపూర్​లో 325 ఎకరాలు సేకరించాలని డిసైడ్​చేసుకుంది. నాదర్​గుల్​లో 91 ఎకరాలు, ప్రతాపసింగారంలో 152 ఎకరాలు, భోగారంలో 125 ఎకరాలు కలిపి మేడ్చల్​, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో మొత్తం వెయ్యి ఎకరాలు సేకరించాలని అనుకుంటోంది.

మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
ఈసారి హెచ్ఎండీఏ వేసే లే ఔట్లలో కనీసం 50శాతం మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 150, 200, 300 స్క్వేర్​యార్డ్​లలో ఉండేలా ప్లాన్​రూపొందిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆఫీసర్ల ప్లాన్​ ప్రకారం ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేసి, భూముల వేలం నిర్వహిస్తే హెచ్​ఎండీఏకు దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందనేది అంచనా.

హెచ్ఎండీఏ లేఅవుట్లు అయితే ఎటువంటి లిటిగేషన్లు ఉండవని, ప్రభుత్వ సంస్థ కావడం వల్ల వేరే ఆలోచన లేకుండా కొనవచ్చని ప్రజల అభిప్రాయం. భవిష్యత్​ప్రాజెక్టులకు కూడా ఈ డబ్బులు ఉపయోగపడతాయని హెచ్ఎండీఏ భావిస్తోంది.