పాత కోర్టు కాంప్లెక్స్​ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హెచ్​ఎండీఏ

పాత కోర్టు కాంప్లెక్స్​ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హెచ్​ఎండీఏ

దిల్ సుఖ్ నగర్, వెలుగు : హైకోర్టు తీర్పుతో సరూర్ నగర్ లోని  రంగారెడ్డి జిల్లా పాత కోర్టు భవనం, ప్రాంగణ స్థలాన్ని హెచ్ఎండీఏ  అధికారులు  పోలీసు బందోబస్తు తో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. సరూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని  హుడా కాంప్లెక్స్ పక్కన హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్పట్లో సరూర్ నగర్ కమర్సియల్ కాంప్లెక్స్  నిర్మించి,  రంగారెడ్డి జిల్లా కోర్టు భవనం సముదాయాలకు కేటాయించింది.  అనంతరం  2008 లో ఆ కోర్టును ఎల్ బీ నగర్ కు తరలించారు.   కాంప్లెక్స్ ఖాళీగా ఉంది.  అయితే  కాంప్లెక్స్​ కిందిభాగంలో  మాత్రం 32 దుకాణాలు ఉండగా .. వీటిని అప్పట్లోనే  కొందరు  లీజుకు తీసుకొని, అద్దెకు ఇస్తూ వచ్చారు. 

 నెలకు రూ. 15 వేల చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. కానీ,  లీజు డబ్బులు మాత్రం చెల్లించలేదు.  మరోవైపు బిల్డింగ్​ కూడా శిథిలావస్థకు చేరింది.  దీంతో  షాపులను ఖాళీ చేయాలని నిర్వాహకులకు అధికారులు గతంలో నోటిసులిచ్చారు. కొందరు ఖాళీ చేయకుండా హైకోర్టును అశ్రయించారు. కాగా, వీరికీ హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో  కోర్ట్  కాంప్లెక్స్ ను హెచ్​ఎండీఏ స్వాధీనం చేసుకుంది.   హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్ మెంట్ సెల్ డీఎస్పీ జానకి రెడ్డి ఆధ్వర్యంలో దుకాణదారులను ఖాళీ చేయించారు.