- హెచ్ ఎండీఏలో 7 నెలలుగా పోస్టు ఖాళీ
- ఇన్ చార్జ్ సీఈతోనే నెట్టుకొస్తున్న అధికారులు
- భారీ ప్రాజెక్టులతో బిజీ కానున్న హెచ్ఎండీఏ
హైదరాబాద్,వెలుగు : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు పూర్తిస్థాయి చీఫ్ ఇంజనీర్(సీఈ)లేరు. దీంతో కీలక ప్రాజెక్టులపై సంస్థ అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. సుమారు7 నెలలుగా సీఈ పోస్టు ఖాళీగా ఉంది. హెచ్ఎండీఏ కమిషనర్గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్ వచ్చినా.. ఇంకా హెచ్ఎండీఏపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసేందుకు సమయం పట్టనుంది.
ఇక కీలకమైన చీఫ్ ఇంజనీర్ పోస్టు భర్తీపై చాలాకాలంగా ఎదురుచూపే అవుతుంది. ప్రస్తుతం ఇన్ చార్జ్ సీఈతోనే నెట్టుకొస్తున్నారు. త్వరలోనే భారీ ప్రాజెక్టులు ప్రారంభిస్తుండగా.. యాక్టివ్ సీఈ ఉంటేనే ప్రణాళిక మేరకు నిర్మాణాలు కొనసాగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా కొద్ది రోజులుగా కొత్త సీఈ ఎంపికపై దృష్టి పెట్టింది.
దీంతో ప్రస్తుత ఇన్‌చార్జ్ తో పాటు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్పొరేషన్(హెచ్ జీసీ)లో సీనియర్ అధికారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం. చివరకు ఈ పోస్టు ఎవరికి దక్కుతుందా..! అనే ఉత్కంఠ నెలకొంది. కమిషనర్ నిర్ణయం మేరకే ప్రభుత్వం కూడా నియామకం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
గత సర్కార్ హయాంలో ఇష్టారాజ్యం
గత సర్కారు హయాంలో పని చేసిన హెచ్ఎండీఏ సీఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక ప్రాజెక్టులన్నీ సీఈ నేతృత్వంలోనే జరుగుతుండగా.. అందకే ఈ పోస్టుకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఈగా పనిచేసిన వ్యక్తి స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి చెప్పినట్లుగా ఆయన నడుచుకున్నారని, పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ సర్కార్ రాగానే కీలక అధికారులను తప్పించినది. ఇక తనను కూడా తొలగించకముందే వెళ్లిపోతానంటూ ఆయన రాజీనామా చేశారు. హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్ కూడా లేక పోవడంతో సీఈ నియామకం కూడా వాయిదా పడుతోంది. తాజాగా కొత్త ఎండీ నియామకంతో త్వరలో పూర్తిస్థాయి సీఈ కూడా రావొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా కొందరు అధికారుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
భారీ ప్రాజెక్టులు చేపట్టనుండగా..
త్వరలో హెచ్ఎండీఏ పలు కీలక ప్రాజెక్టులను చేపట్టనుంది. ఇందులో అత్యంత కీలకమైన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ఉంది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, జేబీఎస్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్లను చేపట్టనుంది. 3,812 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైంది. దాదాపు 60వేల కోట్లతో మూసీ రివర్డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కానుంది.
ఈ రెండు హెచ్ఎండీఏకు ఎంతో కీలకమైనవి. ఇవేకాకుండా సిటీలో స్కైవేలు, ఇతర ప్రాజెక్టులు రానున్నాయి. ఇలాంటప్పుడు యాక్టివ్ సీఈని నియమించాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు. త్వరలోనే సీఈ నియామకం జరుగుతుందని అంటున్నారు. అయితే సీనియారిటీని పరిగణలోకి తీసుకునే నియామకం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే వీటిని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిర్వహించి నియమిస్తరా? లేక నేరుగా జరుగుతుందా? అనేది ఆసక్తిగా మారింది.