
- రూ.350 కోట్లతో ఎకో పార్క్ వద్ద నిర్మించాలని ప్లాన్
- రెండు సార్లు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఎవ్వరూ రాలే
- ఈ ఏరియా 111 జీఓ పరిధిలో ఉండడమే కారణం
హైదరాబాద్ సిటీ, వెలుగు:కొత్వాల్‌గూడలో హెచ్ఎండీఏ నిర్మించిన ఎకో పార్క్ వద్ద ప్రతిపాదించిన టన్నెల్ అక్వేరియం ప్రాజెక్టు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ అందాలను తిలకించేందుకు వ్యూ పాయింట్లతో దాదాపు 150 ఎకరాల్లో ఎకో పార్కు నిర్మించారు. ఇందులోనే బర్డ్స్పార్కు కూడా ఉంది. అలాగే పార్కును ఆనుకుని ప్రపంచ స్థాయి టెక్నాలజీతో రూ.350 కోట్లు ఖర్చు పెట్టి టన్నెల్ అక్వేరియం నిర్మించాలని ప్లాన్సిద్ధం చేశారు.
ఇందులో అరుదైన చేపలు, డాల్ఫిన్స్, వెయ్యి రకాల సముద్ర జీవులను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిసరాల్లో ఫుడ్‌కోర్టులు, కాటేజీలు నిర్మించే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. డిజైన్, బిల్ట్,ఫైనాన్స్, ఆపరేట్అండ్ట్రాన్స్ఫర్పద్ధతిలో నిర్మించేందుకు ప్రైవేట్‌సంస్థల నుంచి గ్లోబల్ టెండర్లు పిలిచారు. అయితే, ఇప్పటివరకూ రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. సొంతంగా నిధులు పెట్టే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలికంగా ప్రాజెక్టును పక్కనబెట్టినట్టు హెచ్ఎండీఏకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
జీఓ111లో ఉండడమే కారణం
టన్నెల్అక్వేరియం ప్రాజెక్టు ముందుకు కదలకపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రాంతం జీఓ111 పరిధిలో ఉండడమే కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే రెండు సార్లు గ్లోబల్టెండర్లు ఆహ్వానించినా అంతర్జాతీయ స్థాయి సంస్థలేవీ ముందుకు రాలేదని చెప్తున్నారు. జీఓ 111 ప్రకారం ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిధిలో శాశ్వత నిర్మాణాలు ఉండకూడదు. కానీ టన్నెల్అక్వేరియం నిర్మిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సైన్స్‌సిటీ, చెన్నైలోని మెరైన్పార్కులో ఈ తరహా అక్వేరియంను నిర్మించారు.
వీటిని సందర్శించేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. అలాంటిదే హైదరాబాద్‌లోనూ నిర్మిస్తే పర్యాటకంగా నగరం అభివృద్ధి చెందుతుందని అధికారుల ఆలోచించారు. అంతకుముందు ప్రాజెక్టును నట్ అండ్బోల్ట్ విధానంలో నిర్మించాలని అనుకున్నారు. అయితే, ఇది కూడా భారీ నిర్మాణాల కిందకు వస్తుండడంతో న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని భావించారు.
పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎవరైనా కేసులు వేస్తే ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వెనకడుగు వేశారు. తాజాగా టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోవడంతో టన్నెల్అక్వేరియం, టూరిస్టులకు కాటేజీలు, ఫుడ్కోర్డుల కోసం మరో ప్రాంతాన్ని వెతుకుతున్నట్టు సమాచారం.