ఉన్న భూములను వాడుకోలేకపోతున్న హెచ్ఎండీఏ

ఉన్న భూములను వాడుకోలేకపోతున్న హెచ్ఎండీఏ
  • గత ప్రభుత్వాలు ఇచ్చింది 8,200 ఎకరాలు
  • వాడుకున్నది 3 వేల ఎకరాలే
  • పదిహేనేండ్ల నుంచి వాడింది మూడు వేల ఎకరాలే
  • భూముల వినియోగంలో అధికారుల నిర్లక్ష్యం
  • సుమారు 600 ఎకరాల భూముల్లో వివాదాలు

హైదరాబాద్, వెలుగు: సిటీ డెవలప్​మెంట్​కు హెచ్​ఎండీఏకు భూములిస్తే, వాటిని సరిగా వాడుకోకపోతుండగా వందల ఎకరాల భూములు కబ్జాల పాలవుతున్నాయి. కోట్ల విలువైన భూములు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఒక్క జవహర్​నగర్​లోనే 50 ఎకరాల భూమిని అక్రమార్కులు ఆక్రమించేశారు. సిటీ అభివృద్ధి లక్ష్యంగా 8,200 ఎకరాల భూములను హెచ్​ఎండీఏకు గత ప్రభుత్వా లు అప్పగించాయి. వసతులు మెరుగుపరచడం, అభివృద్ధిని వికేంద్రీకరించడమే లక్ష్యంగా ప్రణాళికలు కూడా తయారు చేయాలని సూచించాయి. అయితే భూములను పక్కాగా వాడుకోవడంలో సంస్థ అధికారులు ఫెయిలయ్యారనే విమర్శలు ఉన్నాయి. 

కోర్టు కేసులకు సొంత నిధులు
హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ  పరిధి 7 జిల్లాల్లో దాదాపు 7200 చ. కిలోమీటర్ల మేర విస్తరించింది. మౌలిక వసతులు మెరుగుపరచడం, నిర్మాణ అనుమతులు ఇవ్వడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ పని చేస్తోంది. దీంతోపాటు సంస్థకు ఉన్న విలువైన భూములను స్థానిక అవసరాలతో పాటు, సిటీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నిర్మాణాత్మక ప్రణాళికలను కూడా రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఉన్న భూములపైనే నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. సిటీ చుట్టూ వేలాది ఎకరాల భూములు ఉన్నా వాటి నిర్వహణ పట్టించుకోవడంలేదు. దీంతో ఆ భూములన్నీ ఆక్రమణలకు గురవడమే కాకుండా కబ్జాదారులు వివాదాల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో కేసుల నుంచి బయటపడేందుకు సంస్థ సొంత నిధులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

నిరుపయోగంగా భూములు
ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏకు 8,250 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రధానంగా సిటీ శివారులోని రంగారెడ్డి జిల్లాలో 7,452 ఎకరాలు కేటాయించగా ఇందులో కేవలం 3,550 ఎకరాలు మాత్రమే అభివృద్ధి పనులకు వాడుకుంది. మిగిలిన 3,902 ఎకరాలు ఖాళీగా ఉంది. హైదరాబాద్ జిల్లాలో 250 ఎకరాలు ఉంటే, ఇందులో 220 ఎకరాల వరకు వినియోగించింది. మెదక్ జిల్లాలో 550 ఎకరాల భూముల్లో కేవలం 64 ఎకరాలు వాడుకోగా, ఇంకా 486 ఎకరాలు పడావుగానే ఉంచింది. ఇందులో కన్వెన్షన్ సెంటర్లు, కమర్షియల్ హబ్ లతోపాటు, ఐటీ పార్కులను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

అధికారుల నిర్లక్ష్యమే..
మేడ్చల్ జిల్లా పరిధి జవహర్ నగర్​లో దాదాపు 550 ఎకరాల భూముల్లో ఇప్పటికే 50 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయా భూముల్లో అధికారులు గుడిసెలు, అక్రమ నిర్మాణాలను తొలగించారు. మళ్లీ వారం రోజుల్లోనే అక్రమ కట్టడాలు మొదలయ్యాయి. ఇటీవల 2 వేల కోట్ల ఆదాయాన్ని ఇచ్చిన కోకాపేటలోనూ దాదాపు 350 ఎకరాల ల్యాండ్​పై కోర్టు కేసులు ఉన్నాయి. ఈ భూములు హెచ్​ఎండీఏవే అని కోర్టు తీర్పులున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో అక్రమార్కులు వాటిని కబ్జా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 220 ఎకరాల భూములపై పంచాయితీ నడుస్తోందని, పరిష్కరించాలంటే 10 ఏండ్లు పట్టేలా ఉందని అధికారులు అనుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు భూములపై ఫోకస్​ చేసి నిధులను సరిగా వాడుకుంటే డెవలప్​మెంట్ చేయొచ్చు.