ఆమ్దానీపై నజర్ .. సీఎల్‌‌యూ పరిశీలనకు హెచ్ఎండీఏ నిర్ణయం

ఆమ్దానీపై నజర్ ..  సీఎల్‌‌యూ పరిశీలనకు హెచ్ఎండీఏ నిర్ణయం
  • ఇప్పటికే భారీగా వస్తున్న దరఖాస్తులు
  • ఎన్నికల కోడ్​తర్వాత కొలిక్కివచ్చే అవకాశం

హైదరాబాద్, వెలుగు:  హెచ్ఎండీఏ అధికారులు చేంజ్​ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్‌‌యూ)ను మరోసారి పరిశీలించాలని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో భూమార్పిడుల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో  సీఎల్​యూ​ కింద పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చారు. వీటిలో అధిక శాతం దుర్వినియోగం అయినట్టు తేలడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది.  

అవినీతి బాగోతం బయటపడడంతో..

మరోవైపు భూముల మార్పిడికి సంబంధించిన దరఖాస్తుల్లో భారీగా అవినీతి జరిగినట్టు హెచ్ఎండీఏ గుర్తించింది.  సీఎల్‌‌యూ నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారుల నుంచి కొందరు అధికారులు రూ.కోట్లలో డబ్బును వసూలు చేసినట్టు సమాచారం. 111 జీఓ కింద ఉన్న భూములు బయో కన్జర్వేషన్ జోన్‌‌లో ఉండగా, వాటిని కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్‌‌లోకి మార్చినట్లుగా సంస్థ గుర్తించింది. గతంలో వట్టినాగులపల్లిలో రూ.100 కోట్ల విలువైన భూములను 111 జీఓ నుంచి తొలగించి కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్‌‌లోకి అక్రమంగా మార్చారు. దీనిపై అధికారులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే శివబాలకృష్ణ అవినీతి బాగోతం బయటపడడంతో సీఎల్ యూ పై కూడా విచారణ జరిపేందుకు కొంతకాలంగా అధికారులు వీటికి అనుమతులు ఇవ్వడం లేదు.

దరఖాస్తుల సంఖ్య పెరగడంతో..

నగరంలో భారీ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే పెరుగుతోంది. రియల్​ ఎస్టేట్ పుంజుకోవడంతో కొత్త వెంచర్లు, నిర్మాణాలకు బిల్డర్లు, నిర్మాణదారులు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా హెచ్​ఎండీఏ కొన్ని కీలక ప్రాజెక్టులు చేపడుతోంది. వీటికి అవసరమైన నిధులను సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. అందుకే గత కొంత కాలంగా నిలిపివేసిన భూ మార్పిడులను మళ్లీ తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై  ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డికి వివరించారు. గతంలో జరిగిన అవినీతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్న దరఖాస్తులకు అనుమతులు ఇస్తే సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

111 జీఓ ఎత్తివేతతో..

111 జీఓ ఎత్తివేతతో సీఎల్‌‌యూ కోసం హెచ్‌‌ఎండీఏకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుతం హెచ్‌‌ఎండీఏ మాస్టర్‌‌ప్లాన్‌‌లో భాగంగా ఒక జోన్ నుంచి మరో జోన్‌‌లోకి మార్పు చేయాలంటే సీఎల్‌‌యూ తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను  తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు నిర్ణయించారు. 

మాస్టర్‌‌ ప్లాన్‌‌లో 12 జోన్లు

హెచ్‌‌ఎండీఏ మాస్టర్‌‌ప్లాన్‌‌లో 12 జోన్లు ఉన్నాయి. 111 జీఓ  ప్రాంతాల్లోని 84 గ్రామాలను ఏ జోన్‌‌లోకి తీసుకోలేదు. ఈ భూములన్నీ ఆంక్షల మధ్య బయో కన్జర్వేషన్ జోన్‌‌లోనే ఉన్నాయి. అయితే వీటికి నాలా కన్వర్షన్‌‌కు ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉండడంతో ..  సీఎల్‌‌యూ కింద రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా కోరుకున్న జోన్‌‌లకు మార్పు చేయాలని పలువురు యజమానులు అప్పట్లో హెచ్‌‌ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లోనూ కన్జర్వేషన్​ జోన్​ నుంచి రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్​లకు మార్చాలని కొన్ని దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఎన్నికల కోడ్​ ముగిసిన తర్వాతనే ఈ విషయంలో హెచ్​ఎండీఏ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.