హైదరాబాద్, వెలుగు: ఆదాయం పెంచుకునేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తుంది. సంస్థకు చెందిన ఖాళీ భవనాలను రెంటుకు ఇచ్చి తద్వారా ఇన్ కమ్ పొందేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన కమర్షియల్కాంప్లెక్స్ ల్లో ఖాళీగా ఉన్న కార్యాలయాలను ప్రైవేట్ కాంప్లెక్స్‌లకు దీటుగా వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. సిటీలోని ప్రధాన ఏరియాల్లోని సంస్థ భవనాల్లో ఇప్పటికే వ్యాపార సంస్థలు, ఇతర కార్యాలయాలు, కోచింగ్సెంటర్ల లాంటివి ఉన్నాయి. ఇవి కొన్నేళ్లుగా అద్దెకు ఇవ్వకుండా మిగిలిపోయాయి. వాటిని వెంటనే అద్దెకు ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. అమీర్‌పేటలో 3 కాంప్లెక్స్‌లు, తార్నాకలో ఒక కమర్షియల్కాంప్లెక్స్ఉన్నాయి. మొత్తం నాలుగింటిలో కలిపి 4.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. వాటిలో అద్దెకిచ్చినవి కాకుండా ప్రస్తుతం 1.70 లక్షల చ.అ. విస్తీర్ణం ఖాళీగా ఉంది. దాదాపు నాలుగేళ్లుగా ఇవి ఖాళీగానే ఉంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయం రాబట్టుకునేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేటు కాంప్లెక్స్ లకు దీటుగా వసతులు
అద్దెకు ఇస్తే ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరకపోవచ్చని, వాటిలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, పార్కింగ్ సౌకర్యాలు మెరుగుపర్చాలని భావిస్తున్నారు. అమీర్‌పేటలో స్వర్ణజయంతి, మైత్రి వనం, మైత్రి విహార్తోపాటు తార్నాకలో మరో కాంప్లెక్స్ఉన్నాయి. తార్నాకలోని కాంప్లెక్స్ లో కొంతకాలం హెచ్‌ఎండీఏ ఆఫీసులు నిర్వహించి.. దాన్ని అమీర్‌పేటకు ఫిష్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ పెద్దసంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ భవనాల్లో కిరాయి తక్కువ ఉండడంతో పాటు వసతులు ఎక్కువ ఉండడంతో వాటికి డిమాండ్పెరిగింది. దీంతో హెచ్‌ఎండీఏ ఎప్పుడు టెండర్లు పిలుస్తుందా? అని వ్యాపారులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమీర్‌పేటలోని కాంప్లెక్స్‌లకు భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే మూడు కాంప్లెక్స్‌లతో పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్ సంస్థల, వాటి శిక్షణ ఆఫీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరికొన్ని సంస్థలు కూడా కొత్త ఆఫీసుల ఏర్పాటుకు ఎదురు చూస్తున్నాయి.
తక్కువ కావడంతోనే డిమాండ్
ప్రైవేట్కాంప్లెక్స్ల కంటే ప్రభుత్వ కాంప్లెక్స్‌ల్లో అద్దె ధరలు తక్కువగా ఉంటాయి. దీంతో హెచ్ఎండీఏ ఆఫీసులకు డిమాండ్ ఉంది. ప్రైవేట్కాంప్లెక్స్ల్లో నెలకు చ. అ. రూ. 60 నుంచి రూ. 75 అద్దె వసూలు చేస్తున్నారు. హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌లో రూ. 45 – రూ. 55 మధ్యనే ధర ఉంటుంది. పైగా మెరుగైన వసతులను కల్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్కాంప్లెక్స్ల్లో సరైన పార్కింగ్ సౌకర్యం ఉండదు. హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌ల్లో సువిశాల పార్కింగ్ సదుపాయాలు ఉండడంతో ఎంతో కలిసి వస్తుంది. హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌ల్లో ఖాళీగా ఉన్న ఆఫీసులను అద్దెకివ్వాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ విభాగం పర్యవేక్షణలోనే ఆఫీసుల కేటాయింపులు ఉంటుందని అంటున్నారు.