- పాజిటివ్ వస్తే ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్
పద్మారావునగర్, వెలుగు: మన దేశంలో హెచ్ఎంవీపీ (హ్యుమన్ మెటా న్యూమో వైరస్) కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లోని ఐపీ బ్లాక్‌లో హెచ్ఎంపీవీ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. 40 వెంటిలేటర్ బెడ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 15 బెడ్లు పురుషులకు, ఐదు పడకలు మహిళలకు, 20 బెడ్లు చిన్నారుల (పీడియాట్రిక్) కోసం కేటాయించింది. ఈ మేరకు ఆక్సిజన్ సరఫరా చేసే లైన్లను సెట్ చేసింది. కాగా, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ నోడల్ సెంటర్ అయిన గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి ఆధ్వర్యంలో డాక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడారు. ‘‘హెచ్ఎంపీవీ అంత ప్రమాదకరమైంది కాదు. అయినప్పటికీ.. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైరస్ నాలుగేండ్లలోపు చిన్నారులకు, 60 ఏండ్ల పైబడ్డ వృద్ధులు, గర్భిణులకు త్వరగా సోకే చాన్స్ ఉంటది. ఈ వైరస్ బారినపడితే దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతది. అందరూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడం బెటర్. తరుచూ చేతులను సబ్బు లేదంటే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
చేతులను ముక్కు, నోటి ప్రాంతాల్లో తాకనివ్వొద్దు. మాస్క్‌లు ధరించాలి. వైరస్ బారినపడినోళ్లకు తగిన వైద్యం అందిస్తే సరిపోతుంది’’అని ప్రొఫెసర్ రాజకుమారి తెలిపారు. ఈ సమావేశానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ జీకే.సునీల్ కుమార్, ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, పల్మనాలజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ సునీల్ కుమార్, పీడియాట్రిక్ హెచ్‌వోడీ డాక్టర్ వాసుదేవ్, మైక్రోబయాలజీ ఇన్చార్జ్ డాక్టర్ పూజ, ఆర్ఎంవో డాక్టర్ శాంతారాణి హాజరయ్యారు. ఐసోలేషన్ వార్డుల్లో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్, పలు అంశాలపై చర్చించారు.