నాంపల్లిలో పజిల్ పార్కింగ్..నెల రోజుల్లో అందుబాటులోకి

  •  నెల రోజుల్లో అందుబాటులోకి రానున్న కాంప్లెక్స్ 
  • మల్టీ లెవల్ పార్కింగ్​తో వాహనదారులకు తప్పనున్న తిప్పలు
  • అర ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో నిర్మాణం 
  • 250 కార్లు, 200 బైకులు పార్క్ చేసేందుకు వీలు
  • దేశంలోనే తొలిసారిగా జర్మనీ టెక్నాలజీ వినియోగం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నాంపల్లిలో వాహనదారులకు పార్కింగ్ తిప్పలు త్వరలో తప్పనున్నాయి. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న అధునాతన మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ మరో నెలరోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోపు పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచారు. ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ట్రయల్స్ కూడా చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నాంపల్లి ప్రాంతంలో టూవీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ ఇక్కట్లు తప్పనున్నాయి. ముఖ్యంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్​ లాంటి కార్యక్రమాలకు వచ్చే సందర్శుకులు పార్కింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

అలాగే, ఏదైనా పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు, ఇతర పనుల మీద ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా వాహనదారులు పార్కింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నిటికీ ఈ పార్కింగ్ కాంప్లెక్స్ చెక్​పెట్టనుంది. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఆర్ఎల్)కు ఉన్న అర ఎకరం స్థలంలో పీపీపీ పద్ధతిలో రూ.90 కోట్ల వ్యయంతో ఈ కాంప్లెక్స్ ను15 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఈ పార్కింగ్ కాంప్లెక్స్ కు 2018లోనే శంకుస్థాపన జరిగినా.. గత ప్రభుత్వ హయాంలో పనులు స్లోగా నడిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పనులు ఊపందుకున్నాయి. 

తక్కువ స్థలంలో ఎక్కువ కార్లు పట్టేలా.. 

నాంపల్లిలో చేపట్టిన ఈ కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ పార్కింగ్(ఎంఎల్పీ)ను ఢిల్లీకి చెందిన ప్రైవేట్ సంస్థ డెవలప్ చేస్తున్నది. దేశంలోనే జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న తొలి మల్టీ లెవల్ పార్కింగ్ ఇదే కావడం విశేషం. ఇందులో మొత్తం 15 అంతస్తులు ఉండగా.. 10 అంతస్తుల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా ఐదు అంతస్తుల్లో రెండు సినిమా స్క్రీన్లతో ఒక థియేటర్, రెస్టారెంట్లు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. మొత్తం1,44,400 చదరపు అడుగుల్లో భవన నిర్మాణం ఉండగా, అందులో 68 శాతం పార్కింగ్ కోసం, మిగతా 32 శాతం కమర్షియల్ అవసరాల కోసం వినియోగించనున్నారు. 68 శాతం స్థలంలో 250 కార్లు, 200 బైకులు పార్కింగ్ చేసే వీలుండేలా నిర్మించారు. చార్జీలు కారుకు గంటకు రూ. 30, బైకుకు గంటకు రూ. 10 చొప్పున వసూలు చేయనున్నట్టు సమాచారం. అయితే, ముంబై, ఇతర పలు ప్రధాన నగరాల్లోనూ మల్లీ లెవల్ పార్కింగ్ లు ఉన్నా.. అక్కడ తరచూ సమస్యలు వస్తున్నాయి.  

నిమిషంలోనే పార్కింగ్.. 

మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ లో బీ1, బీ2, బీ3 అండర్ గ్రౌండ్ అంతస్తులతోపాటు 5 నుంచి 11 అంతస్తుల వరకు పార్కింగ్ కోసం కేటాయించారు. మూడో అంతస్తులో రెండు స్క్రీన్​లతో ఒక థియేటర్, రెస్టారెంట్లు ఇతర కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్​లో పార్కింగ్ కు సంబంధించి నాలుగు ఎంట్రీ, ఎగ్జిట్ టెర్మినల్స్ ఉంటాయి. ఆ టెర్మినల్స్ వద్ద ఉన్న టర్న్ టేబుల్స్ పై వాహనాలను వదిలితే. లిఫ్టుల ద్వారా నిర్ణీత అంతస్తులోకి చేరుకుంటాయి. సైజును బట్టి తగిన స్లాట్లలో పార్కింగ్ చేస్తారు. పార్కింగ్ ప్రక్రియకు కేవలం ఒక్క నిమిషం మాత్రమే పట్టనుంది. కార్లను తిరిగి తీసుకోవడానికి టర్న్ టేబుల్స్ వద్దనున్న కార్డు రీడర్ల వద్ద స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తే.. కారు నిర్ణీత టర్న్ టేబుల్ వద్దకు చేరుకుంటుంది. టర్న్​టేబుల్ పై ఉన్న కారును రివర్స్ చేసే బాధ లేకుండా టర్న్ టేబుల్స్ వాహనాన్ని కావాల్సిన దిక్కుకు రొటేట్ చేస్తాయి. దీంతో పార్కింగ్ నుంచి కారును రెండు నిమిషాల్లోనే బయటకు తీసేందుకు వీలుకానుంది. ఇక పార్కింగ్ చార్జీలు చెల్లించేందుకు స్మార్ట్ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా పార్కింగ్ చేసేవారికి ఆర్ఎఫ్ఐడీ స్మార్ట్ కార్డులను జారీ చేస్తారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు.