నస్పూర్, వెలుగు: ఎర్రజెండా ముసుగులో ఏఐటీయూసీ వ్యాపారం చేస్తోందని హెచ్ఎంఎస్ లీడర్లు ఆరోపించారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిలో గుర్తింపు, ప్రతిపక్ష సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల పక్షాన ఎప్పుడూ లేదన్నారు. ఆఫీసులు, ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం కోసం కార్మికుల వద్ద బలంవంతంగా లక్షల్లో చందాలు వసూలు చేశారని మండిపడ్డారు.
సింగరేణిలో ప్రతి ఏరియాలో ఇదే దందా చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో కార్మిక హక్కులను ఏఐటీయూసీ కాలరాసిందని, గుర్తింపు సంఘంగా ఉన్నప్పటి నుంచే సింగరేణి స్కూల్స్ ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయని ఫైర్అయ్యారు. కార్మికులు ప్రశ్నిస్తే డిస్మిస్ లు, చార్జిషీట్లు ఇప్పించారని.. ఇప్పుడు కార్మికులను ఓటు అడిగే అర్హత ఆ సంఘానికి లేదన్నారు.
ఒక్కసారి హెచ్ఎంఎస్ కు అవకాశమిస్తే కార్మికుల సమస్యలపై మేధావులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక లీడర్లు తిప్పారపు సారయ్య, అనిల్ రెడ్డి, జైపాల్, దుర్గం లక్ష్మణ్, నర్సయ్య, సాయికృష్ణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, విక్రమ్, నవీన్, మురళి తదితరులు పాల్గొన్నారు.