ఇక లైన్​మెన్ ​తిప్పడు..టెక్నాలజీతో వాల్వ్లు తిప్పేస్తరు.. సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా అమలు

ఇక లైన్​మెన్ ​తిప్పడు..టెక్నాలజీతో వాల్వ్లు తిప్పేస్తరు.. సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా అమలు
  • మొబైల్ యాప్తో నీటి వాల్వ్ల నిర్వహణ
  • అందుబాటులోకి ‘స్మార్ట్​ వాల్వ్​ టెక్నాలజీ’
  • ఆస్కి సహకారంతో సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా అమలు
  • ఇక్కడ సక్సెస్​అయితే నగరమంతా అమలు..
  • ప్రమాదాల నివారణతో పాటు అక్రమాలకూ చెక్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్లో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు వాటర్​బోర్డు అధికారులు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో టైంకు నీటిని విడుదల చేసేందుకు వాల్వ్​లను తిప్పుతుంటారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వాల్వ్​లన్నీ దాదాపు రోడ్లపైనే ఉన్నాయి. ఈ వాల్వ్లను తిప్పే సమయంలో అప్పుడప్పుడూ లైన్​మెన్లు ప్రమాదాలకు గురవుతున్నారు. 

రాత్రి వేళల్లో రోడ్లపై వెళ్లే వాహనాలు ఢీకొట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో గుంతలు కనిపించక ప్రమాదాల పాలైన వారూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా లైన్​మెన్ల పనుల్లో టెక్నాలజీని ఉపయోగించాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. స్మార్ట్​ వాల్వ్​ టెక్నాలజీతో వాల్వ్​లను ఆటోమేటిక్​గా నియంత్రించే ఆలోచన చేసింది. ప్రయోగాత్మకంగా నగరంలోని సనత్​ నగర్​లో ఈ పద్ధతిలో వాల్వ్​లు తిప్పుతున్నారు.  

ఆస్కి సహకారంతో..
స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీతో (ఆటోమేటిక్ వాల్వ్ ఆపరేషన్ పద్ధతి) ప్రయోగాత్మకంగా కొన్ని రోజులుగా సనత్ నగర్లో వాల్వ్ల నిర్వహణ చేపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్​ స్టాఫ్​ కాలేజీ ఆఫ్​ ఇండియా (ఆస్కి) సహకారంతో ఈ స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. టెక్నికల్​సపోర్ట్​అందజేస్తున్న కంపెనీతో ఆస్కి ఎంవోయూ చేసుకుని వాటర్​బోర్డుకు ఈ టెక్నాలజీని అందిస్తోంది. దీనివల్ల  లైన్ మెన్లు ఫీల్డ్​లెవెల్​కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం మొబైల్ యాప్ తో స్మార్ట్​వాల్వ్​లను ఆపరేట్ చేయొచ్చు.

అంతేగాకుండా వాటర్ క్వాలిటీ, క్వాంటిటీ, క్లోరిన్ పర్సంటేజ్​కూడా తెలుసుకోవచ్చు. దీన్ని సోలార్ ఎనర్జీతో రన్​చేయవచ్చని అధికారులు తెలిపారు. బ్యాటరీ బ్యాకప్ సైతం ఉండడంతో పవర్ సమస్యలు కూడా ఉండవని చెప్తున్నారు. సనత్​నగర్లో ఇప్పటివరకు సమర్థంగానే పని చేస్తుండడంతో ఈ టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకునేందుకు అధికారులు ఆస్కితో సంప్రదింపులు జరుపుతున్నారు. వారు ఓకే చెప్తే త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో స్మార్ట్​ వాల్వ్​ టెక్నాలజీని అమలు చేస్తామని అధికారులు అంటున్నారు.

అక్రమాల నివారణకు కూడా..
ఒక ప్రాంతంలో ఎక్కువ టైం నీళ్లు రావాలన్నా, ఎక్కువ ప్రెషర్​ తో నీళ్లు రావాలన్నా లైన్​మెన్లపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాలు, కాలనీలు, అపార్ట్​మెంట్లు ఉన్న ప్రాంతాల్లో జనాలు ఎక్కువ ప్రెషర్తో, ఎక్కువ సేపు నీళ్లు రావాలని కోరుకుంటారు. దీంతో దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు లైన్​మెన్లు ముడుపులు తీసుకుని నీటి సరఫరా ఎక్కువ సేపు రావడానికి, ఎక్కువ ప్రెషర్​ వచ్చేలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిల్లో అమల్లోకి వస్తే వాల్వ్​ల నిర్వహణ, నీటి సరఫరా తీరును హెడ్డాఫీసు నుంచి మానిటర్​ చేసే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు లైన్​మెన్ల అక్రమాలకు చెక్​పెట్టవచ్చని అధికారులు అంటున్నారు.