పెట్రోల్​ మస్తు కొంటున్రు

  • ధరలు పెరుగుతాయనే భయంతో వల్లే!    
  • ఈ నెలలో ఇప్పటికే 18 శాతం పెరిగిన డిమాండ్

న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినందున త్వరలోనే పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచుతారన్న వార్తల కారణంగా జనం వెహికల్​ ట్యాంకులను ఫుల్​ చేయించుకుంటున్నారు. గత ఏడాది మార్చి మొదటి రెండు వారాలతో పోలిస్తే ఈ నెల మొదటి రెండు వారాల్లో అమ్మకాలు 18 శాతం పెరిగి 12.3 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వరంగ ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు తెలిపాయి. దేశంలోని ఫ్యూయల్ రిటెయిల్​ మార్కెట్లో ప్రభుత్వ రంగ ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలకు 90 % వాటా ఉంది. 2019 మార్చి లెక్కలతో పోలిస్తే ఈ అమ్మకాలు 24.4% ఎక్కువ. ఏడాది ప్రాతిపదికన డీజిల్​ అమ్మకాలు 23.7 శాతం పెరిగి 35.3 లక్షల టన్నులకు చేరుకున్నాయి. 2019 మార్చి మొదటి రెండు వారాల అమ్మకాలతో పోలిస్తే ఇవి 17.3 % ఎక్కువ.  2020 మార్చి మొదటి రెండు వారాల పెట్రోల్​ సేల్స్​ పోలిస్తే గత నెల ఇదేకాలంలో 24.3 శాతం పెరిగాయి. డీజిల్​ వాడకం 33.5 శాతం పెరిగింది. ధరలు పెరుగుతాయనే అంచనాల వల్లే జనం పెట్రోల్​, డీజిల్​ను విపరీతంగా కొంటున్నారని కేంద్ర చమురుశాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పురి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గత 132 రోజులుగా పెట్రోల్​, డీజిల్ ​ధరలను మార్చలేదు. గత నవంబరులో క్రూడాయిల్ పీపా ధర 81 డాలర్లు ఉండగా, ఇటీవల దీని ధర ఏకంగా 130 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ధర 102 డాలర్ల వరకు ఉంది. ఎన్నికలు ముగిసినప్పటికీ ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున ప్రభుత్వం ధరల పెంపునకు దూరంగా ఉందని భావిస్తున్నారు. 

ధరలను పెంచడంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ ‘‘ఎలక్షన్లు అయిపోగానే ధరలు పెంచుతారని ప్రతిపక్షాలు ప్రచారం చేయడంతో అమ్మకాలు 20% పెరిగాయి. ఇలాంటి ప్రచారం సరైంది కాదు. ధరలు పెంచాలా వద్దా ? అనే విషయాన్ని ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు చూసుకుంటాయి. ఎంతకాలం భరించగలిగితే అంతకాలం వరకు ధరలను పెంచకుండా ఆపుతాయి”అని అన్నారు. పెట్రోల్​, డీజిల్​లతో పాటు ఎల్పీజీ వాడకం కూడా గత మార్చితో పోలిస్తే ఈ మార్చిలో 17% పెరిగింది. గత నెలలో 18 లక్షల టన్నుల ఎల్పీజీ అమ్ముడయింది.  ఇదిలా ఉంటే,  విమానాల్లో వాడే ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయల్​ (ఏటీఎఫ్) ధర బుధవారం 18 శాతానికి పెరిగి ఆల్​టైం హైకి చేరింది. ప్రస్తుతం కిలో లీటరు ధర రూ.1.10 లక్షలకు చేరింది. ఈ ఏడాదిలో ఏటీఎఫ్​ ధరను ఇప్పటి వరకు 6 సార్లు పెంచారు.

తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు 

రష్యా–ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తుండటం, చైనాలో మళ్లీ కోవిడ్ రిస్ట్రిక్షన్ల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత తగ్గాయి. బుధవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర మంగళవారం ముగింపుతో పోలిస్తే 0.27 శాతం తగ్గి  102.18 డాలర్లకు తగ్గింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధరలు కూడా తగ్గాయి. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్–ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి కనిపించడం, చైనాలో తాజా వైరస్ వ్యాప్తి కారణంగా  ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ కూడా దాని షెల్ ఆయిల్ ఉత్పత్తిని పెంచిందని చెప్పారు. చమురు ధరలు 14 ఏళ్ల హైకి చేరుకోవడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా దాడి తర్వాత దాదాపు రికార్డు స్థాయిలకు పెరిగిన చమురు ధరలు, గత రెండు సెషన్లలో దిగివచ్చాయి. ఈ నెల ఏడో తేదీన బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ధర139.13 డాలర్లకు చేరుకుంది. 2008 తర్వాత ఇదే అత్యధిక ధర.