ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్ లో జరిగే బిగ్ బాష్ లీగ్ 2025 టైటిల్ ను హోబర్ట్ హరికేన్స్ గెలుచుకుంది. సోమవారం (జనవరి 27) హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో సిడ్నీ థండర్ పై జరిగిన ఈ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మిచెల్ ఓవెన్ 42 బంతుల్లో 6 ఫోర్లు.. 11 సిక్సర్లతో 108 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. హోబర్ట్ హరికేన్స్ కు ఇదే తొలి బిగ్ బాష్ లీగ్ టైటిల్ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలోనే ఛేజ్ చేసి మ్యాచ్ గెలిచింది.
ఓవెన్ బౌండరీల వర్షం:
కళ్ళ ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికీ హోబర్ట్ వెనకడుగు వేయలేదు. తొలి ఓవర్ నుంచే థండర్స్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఓవెన్ విధ్వంసంతో తొలి ఓవర్ లోనే 23 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లలోనే జట్టు 60 పరుగులు రాబట్టింది. ఇదే జోరును కొనసాగిస్తూ తొలి ఆరు ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 98 పరుగులు చేసి మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఓవెన్..39బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మాథ్యూ వేడ్ (18),బెన్ మెక్‌డెర్మోట్(32) జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ను ఫినిష్ చేశారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ వార్నర్(48), సంఘా (67) తొలి వికెట్ కు 10.2 ఓవర్లలోనే 97 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. అయితే చివరి 10 ఓవర్లలో థండర్స్ ఆశించిన పరుగులు చేయలేకపోయింది. ఓపెనర్లు మినహా ఏ ఒక్కరూ ఆడకపోవడంతో చివరి 10 ఓవర్లలో కేవలం 85 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Mitch Owen's masterclass seals Hobart Hurricanes' maiden Big Bash title 🏆
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2025
Scorecard: https://t.co/OcOxFKyHoh pic.twitter.com/gE9Q8WH7na