- క్రికెట్,బ్యాడ్మింటన్ , టీటీ, స్క్వాష్ కూడా
- ఖర్చులు తగ్గించుకునేందుకు 10 ఆటలు తప్పించిన సీడబ్ల్యూజీ
లండన్ : కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీడబ్ల్యూజీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మెగా గేమ్స్‌లో ఇండియాకు ఎక్కువ పతకాలు వచ్చే హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్‌తో పాటు టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయథ్లాన్ వంటి పది క్రీడాంశాలను 2026 గ్లాస్గో గేమ్స్ నుంచి తప్పించింది. ఖర్చులు తగ్గించుకోవడం, నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను నివారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీడబ్ల్యూజీ మంగళవారం ప్రకటించింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 19 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు. ఇప్పుడు దాన్ని 9–10కి కుదించి నాలుగు వేదికల్లోనే పోటీలు ముగించనున్నారు.
‘గ్లాస్గోలో అటు ఇటుగా 10 క్రీడాంశాలు ఉండొచ్చు. ఆర్థిక, కార్యాచరణలో సమతుల్యం తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, బౌల్స్, పారా బౌల్స్, 3X3 బాస్కెట్‌బాల్, 3X3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ మాత్రమే ఉంటాయి’ అని సీడబ్ల్యూజీ పేర్కొంది.
వాస్తవంగా 2026 కామన్వెల్త్‌కు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ అధిక ఖర్చుల కారణంగా విక్టోరియా ఆతిథ్య హక్కులను వదిలేసుకోవడంతో 12 ఏండ్ల తర్వాత గ్లాస్గోకు మళ్లీ చాన్స్ దక్కింది. 2026 జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి.
నాలుగు వేదికల్లోనే పోటీలు
మొత్తం గేమ్స్‌కు నాలుగు వేదికలైన స్కాట్‌స్టౌన్ స్టేడియం, టోల్‌క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్, ఎమిరేట్స్ ఎరీనా, సర్ క్రిస్ హోయ్ వెల్‌డ్రోమ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ‘సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్ట్, డ్రైవర్ల సమస్యలతో భారీగా ఖర్చు పెరిగిపోతున్నది. రిస్క్‌ను తగ్గించుకోవడానికి నాలుగు వేదికల్లోనే గేమ్స్‌ను నిర్వహిస్తాం.
షూటింగ్ రేంజ్ గ్లాస్గోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లడం చాలా ఇబ్బంది. అందుకే షూటింగ్‌ను తీసేశాం. ఆర్చరీ ముందు నుంచి లేదు కాబట్టి ఈసారి కూడా పరిగణనలోకి తీసుకోలేదు. 2026 ఆగస్టు 15 నుంచి హాకీ వరల్డ్ కప్ ఉంటుందన్న కారణంతో గేమ్స్ నుంచి తప్పించాం’ అని సీడబ్ల్యూజీ వెల్లడించింది.
పతకాలు కష్టమే..
సీడబ్ల్యూజీ నిర్ణయం వల్ల ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, షూటింగ్‌లో ఇండియాకు ఎక్కువ మెడల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ క్రీడాంశాలు లేకపోవడం వల్ల మెడల్స్ సంఖ్య భారీగా తగ్గనుంది. ఇప్పటి వరకు మెన్స్ హాకీలో ఇండియాకు మూడు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి.
విమెన్స్ టీమ్ ఓ గోల్డ్‌తో కలిపి మూడు మెడల్స్ సాధించింది. బ్యాడ్మింటన్‌లో 31 మెడల్స్ (10 గోల్డ్, 8 సిల్వర్, 13 బ్రాంజ్) వచ్చాయి. షూటింగ్‌లో 135, రెజ్లింగ్‌లో 114 మెడల్స్ లభించాయి. క్రికెట్‌లో ఇండియా విమెన్స్ టీమ్ సిల్వర్ గెలిచింది. పారా అథ్లెటిక్స్‌లోనూ ఇండియా పారా అథ్లెట్లు చాలా పతకాలు సాధించారు. 2026 ఎడిషన్‌లో వీటన్నింటికి చెక్ పడ్డట్లే.
ఆశ్చర్యం..ఆవేదన
సీడబ్ల్యూజీ తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులు, అడ్మినిస్ట్రేటర్లు ఆశ్చర్యంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు వచ్చే క్రీడలను తప్పించడం చాలా బాధాకరమైన అంశమని, ఇండియా పతకాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని టీటీ ప్లేయర్ శరత్ కమల్ అన్నాడు. సీడబ్ల్యూజీ నిర్ణయం షాక్‌కు గురి చేసిందని, చాలా నిరాశను కలిగిస్తోందని హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు.
ఎఫ్‌ఐహెచ్, హాకీ ఇండియా కూడా ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రధాన క్రీడలను రోస్టర్ నుంచి తొలగించడం కరెక్ట్ కాదని సత్యన్ అన్నాడు. ఇప్పుడిప్పుడే స్క్వాష్‌లో ఓ అడుగు ముందుకెళ్తుంటే, సీడబ్ల్యూజీ నిర్ణయం వల్ల రెండు అడుగులు వెనక్కి పడ్డాయని దీపిక పల్లికల్ తెలిపింది.