2026లో గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ మార్పులు జరిగాయి. ఈసారి కామన్వెల్త్ క్రీడల నుండి బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్, క్రికెట్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, నెట్‌బాల్, రోడ్ రేసింగ్ వంటి ముఖ్యమైన క్రీడలను తొలగించారు. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కామన్వెల్త్ క్రేడా సమాఖ్య వెల్లడించింది.
2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 19 క్రీడల్లో పోటీలు నిర్వహించగా, ఈసారి పది క్రీడలలతో సరిపెట్టనున్నారు. అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ (ట్రాక్ & ఫీల్డ్), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, బౌల్స్, పారా బౌల్స్, 3x3 బాస్కెట్‌బాల్, 3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ విభాగాల్లో మాత్రమే పోటీలు ఉండనున్నాయిని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రీడల్లో 74 కామన్వెల్త్ దేశాల నుండి దాదాపు 3000 మంది అథ్లెట్లు పాల్గొనున్నారు.
భారత్‌కు భారీ దెబ్బ
కామన్వెల్త్ క్రేడా సమాఖ్య తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, భారత అథ్లెట్లు సాధారణంగా హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్ వంటి క్రీడల్లో పతకాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 61( 22 స్వర్ణాలు+16 రజతాలు+ 23 కాంస్యాలు) పతకాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. వీటిలో రెజ్లింగ్‌లో 12, వెయిట్ లిఫ్టింగ్‌లో 10, అథ్లెటిక్స్‌లో 8 పతకాలొచ్చాయి. అలాంటిది ఈ క్రీడలను తొలగించడంతో పతకాల సంఖ్యలో భారీ కోత పడనుంది.
2026 కామన్వెల్త్ గేమ్స్ మార్చి 17 నుండి మార్చి 29 వరకూ స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరగనున్నాయి. వాస్తవానికి ఈ టోర్నమెంట్ 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా వేదికగా జరగాల్సి ఉండగా, ఖర్చుల కారణంగా విక్టోరియా ఆతిథ్య హక్కులను వదులుకుంది.