Paris Olympics 2024: మిషన్ పారిస్ ఒలింపిక్స్‌.. భారత హాకీ జట్టు ప్రకటన

Paris Olympics 2024: మిషన్ పారిస్ ఒలింపిక్స్‌.. భారత హాకీ జట్టు ప్రకటన

జూలై 26 నుంచి 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌ క్రీడలకు భారత పురుషుల జట్టును 'హాకీ ఇండియా(Hockey India)' ప్రకటించింది. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తుండగా, హార్దిక్ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. భారత ఒలింపిక్ హాకీ జట్టులో ఏకంగా ఐదుగురు కొత్త వాళ్లు చోటు దక్కించుకున్నారు.

స్క్వాడ్ విషయానికి వస్తే.. వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్, మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ జట్టులో కీలకం కానున్నారు. సమ్మర్ గేమ్స్‌లో వీరు పాల్గొనడం ఇది నాల్గవ సారి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్ డిఫెన్స్ లైన్‌లో భాగం కాగా.. ఫార్వర్డ్ లైన్‌లో మన్‌దీప్‌తో పాటు అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, గుర్జంత్ సింగ్ ఉన్నారు. జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్ కుమార్ పాల్, అభిషేక్, సుఖజీత్ సింగ్‌ల రూపంలో ఐదుగురు కొత్త వాళ్లు జట్టులోకి వచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో తలపడేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ పేర్కొన్నారు. 

బెల్జియంతో కలిసి..

బెల్జియం(గత ఒలింపిక్స్‌లో స్వర్ణం), ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్ , ఐర్లాండ్‌లతో కలిసి భారత జట్టు పూల్ బిలో ఉంది. ఒలింపిక్స్‌లో గతంలో భారత్ 8 బంగారు, 1 రజత, 3 కాంస్య పతకాలను గెలుచుకోవడంతో హాకీ జట్టుపై భారీ ఆశలు ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా కాంస్య పతకాన్ని సాధించింది.

పారిస్ ఒలింపిక్స్ 2024కు భారత హాకీ జట్టు

  • గోల్ కీపర్లు: శ్రీజేష్, పరట్టు రవీంద్రన్.
  • డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, సంజయ్.
  • మిడ్‌ ఫీల్డర్లు: రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్.
  • ఫార్వర్డ్స్:  అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్.
  • ప్రత్యామ్నాయ అథ్లెట్లు: నీలకంఠ శర్మ, జుగ్రాజ్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్.