దేశం కన్నా డబ్బే ముఖ్యం: సెంట్రల్ కాంట్రాక్టు వద్దనుకున్న విండీస్ స్టార్ క్రికెటర్లు

దేశం కన్నా డబ్బే ముఖ్యం: సెంట్రల్ కాంట్రాక్టు వద్దనుకున్న విండీస్ స్టార్ క్రికెటర్లు

క్రికెట్ లో వెస్టిండీస్ జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. వరుసగా మూడు సార్లు వన్డే వరల్డ్ ఫైనల్ కు వెళ్లిన ఆ జట్టు వరుసగా రెండు సార్లు(1975,1979) విశ్వ విజేతగా నిలిచింది. రెండు దశాబ్దాలు ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఆ జట్టు క్రమంగా దిగజారుతూ వస్తుంది.  ప్రస్తుతం విండీస్ జట్టు పరిస్థితి చూసుకుంటే పసికూనలకంటే దారుణంగా కనిపిస్తుంది. అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, జింబాబ్వే వంటి జట్ల చేతుల్లోనూ పరాజయం పాలై.. పాతాళానికి పడిపోయింది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించలేక విమర్శలు మూటకట్టుకుంది. 

విండీస్ జట్టు ఇంతలా దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటని పరిశీలిస్తే స్టార్ ఆటగాళ్లు దేశానికంటే లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఇదే నిజం అని తేలింది. స్టార్‌ క్రికెటర్లు నికోలస్‌ పూరన్‌, జేసన్‌ హోల్డర్‌, కైల్‌ మేయర్స్‌ తమకు కాంట్రాక్టులు అవసరం లేదని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపారు. వెస్టిండీస్ క్రికెట్‌ బోర్డు ఇచ్చిన కాంట్రాక్టులను వీరు తిరస్కరించారు. కాకపోతే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌నకు మాత్రం అందుబాటులో ఉంటామని బోర్డుకు స్పష్టం చేశారు. 

ఏ గ్రేడ్ లో భారత క్రికెటర్లు సంవత్సరానికి సుమారు రూ. 7 కోట్లు సంపాదిస్తే, వెస్టిండీస్ క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్ట్‌ల ద్వారా కేవలం రూ. 1.2 కోట్లు మాత్రమే దక్కుతుంది. గతేడాది ఐపీఎల్ వేలంలో నికోలస్ పూరన్ రూ.16 కోట్లకు అమ్ముడుపోయాడు. హోల్డర్, మేయర్స్ కు మంచి ధర పలకడంతో నాలుగు రాళ్లు సాంపాదించుకునే పనిలో వీరున్నారు.  2012, 2016లో రెండు టీ 20 ప్రపంచ కప్ టైటిళ్లను విండీస్‌ గెలుచుకున్నా.. వన్డే టెస్టుల్లో మాత్రం ఆ జట్టు దారుణంగా విఫలమవుతుంది.

లీగ్‌ క్రికెట్‌లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఈ క్రికెటర్లు.. దేశం తరఫున టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటామని చెప్పడంపై వెస్టిండీస్‌ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పూరన్, హోల్డర్, మేయర్స్ చివరిసారిగా 2023 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లు ఆడారు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత వీరు జాతీయ జట్టుకు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.