ఒకే దేశం, ఒకే ఎన్నిక పేరుతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలను జరిపించటానికి వీలుగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఇంతకుముందే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని నియమించిన ప్రభుత్వం ఆ కమిటీ నివేదికను ఆమోదించింది. గత పార్లమెంట్ సమావేశాల్లో జేపీసీకి నివేదించింది. కానీ, ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రక్రియను ప్రారంభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషనర్ల నియామకం నుంచి సుప్రీంకోర్టు జడ్జీని తప్పించి, ప్రభుత్వంలోని మంత్రిని సభ్యునిగా నియమించే బిల్లును ఆమోదించింది. ఇక ఇవన్ని ఏకపక్షంగా చేసుకుంటూ వెళ్లటం భారత సమాఖ్య స్ఫూర్తికి ఏమాత్రం మంచిది కాదు.
ప్రస్తుతం ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం బాగానే వినిపిస్తున్నా.. భవిష్యత్‌లో ఒకే పార్టీ అధికారంలో ఉండేలా ఈ చర్యలు సహకరిస్తాయి. రాజ్యాంగం ప్రకారం భారత్ అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ, ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని మాత్రం తగ్గించకుండా ఉండాలి. భారత్‌లాంటి గణతంత్ర దేశాలకు రాష్ట్రాలు ఆయువుపట్టులాంటివి. అందుకే ఈ దేశం ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాల్ని చూసింది. ఎందుకంటే దేశంలో తీసుకున్న చాలా ప్రగతిశీల నిర్ణయాలు సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉండి... భిన్న అభిప్రాయాల్ని పార్లమెంట్ సాక్షిగా చర్చించి తీసుకున్నవే. అలాంటి దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించి పార్లమెంట్ నుంచి మొదలుపెట్టి పంచాయతీ వరకు ఒకే పార్టీ ఓటర్లకు కనిపించేలా చేయటమే ప్రధాని మోదీ పన్నాగం.
మనం ఎన్నికల సరళిని గమనిస్తే... గతంలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ఢిల్లీ, కర్నాటక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల్ని ఆయా రాష్ట్రాల్లో గెలిపించారు. దీన్నిబట్టి మనకు ఏం అర్థమవుతుందంటే.. ప్రజలు తమ విచక్షణకు అనుగుణంగా ఓట్లేస్తారు. దాన్ని మార్చటానికే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్నికల పేరుతో ప్రధాన మంత్రి తరచుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పంచాయతీ ఎన్నికలకు కూడా అగ్రస్థాయి నేతలు ఊళ్లోకి వచ్చి ప్రచారం చేసే ఆస్కారం ఉంది. మనది పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ . కానీ, ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ద్వారా మోదీ.. అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని పరోక్షంగా తీసుకువచ్చే అవకాశముంది. చివరికి దేశంలోని ఎన్నికలు బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ నుంచి ఏకపార్టీ వ్యవస్థగా మారే ప్రమాదం ఉంది. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని చెప్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం... మన రాజ్యాంగ విధానాల్ని, సమాఖ్య స్ఫూర్తిని కేవలం ఆర్థిక కోణంలో ఆలోచించి తగ్గించుకోలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జమిలి ఎన్నికలు అర్థరహితం
జమిలి ఎన్నికలు నిర్వహించి..ఒకవేళ రాష్ట్రాల్లో ఎన్నుకున్న ప్రభుత్వాలు రెండు ఏండ్లకు పడిపోతేనో.. రద్దయితేనో కేవలం మిగిలిన మూడేళ్ల కాలానికే ఎన్నికలు నిర్వహించాలన్నది కమిటీ ప్రతిపాదన. ప్రస్తుతం ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఐదేళ్ల కాలానికి ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ, కమిటీ ప్రతిపాదన ప్రకారం కేవలం మిగిలిన కాలానికే ప్రభుత్వం ఏర్పడితే ఎన్నికల ఖర్చు వృథా అవుతుంది. కాబట్టి, జమిలి ఎన్నికల వల్ల ఇంకా ఖర్చు పెరుగుతుందే తప్ప తగ్గదు. ప్రస్తుతం వివిధ సమయాల్లో జరిగే ఎన్నికల కోసం ఈవీఎంలు, భద్రత సిబ్బందిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ, ఒకేసారి ఎన్నికలు జరిగితే అవసరమైన ఈవీఎంల సంఖ్యతో పాటు భద్రతా సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుంది. దాంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. కాబట్టి ఖర్చు తగ్గించుకోవటానికి జమిలి ఎన్నికలు అన్నది అర్థరహితం.
ఒకేసారి ఎన్నికలతో అదనపు ఖర్చు
ఇప్పటికే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మెజార్టీ కోల్పోతే అధికారాలన్ని కేంద్రానికి దఖలు పడతాయి. ఒకవేళ 2029 నుంచే జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. గతేడాది ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు 2027 నాటికి ఎన్నికలు నిర్వహించాలి. ఆతర్వాత 2029కే ఆయా శాసన సభల్ని రద్దుచేసి లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ ప్రభుత్వాలు 2026లోనే ఎన్నికలకు వెళ్తాయి.
వాటిని కేవలం మూడేళ్లకే పరిమితం చేయాల్సి వస్తుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు లోక్‌సభ ఎన్నికలు అటు ఇటుగా జరిగాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. ఇలా ప్రభుత్వాల కాలాన్ని పొడిగించటానికి, తగ్గించటానికి కానీ రాజ్యాంగంలో ఎలాంటి అవకాశం లేదు. బాలాకోట్, పుల్వామా లాంటి ఘటనలు జరిగిన 2019లో ఫలితాలు ఎలా బీజేపీకి వచ్చాయో గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పటికే నోట్ల రద్దు, పేదరికం, నిరుద్యోగం గురించి ప్రజలు చర్చించటం మర్చిపోయారు. గతంలో మహారాష్ట్ర, కర్నాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రజలిచ్చిన తీర్పును మళ్లించి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికల్ని తన ప్రయోజనాలకు వాడుకుంటాయోమో అన్న అనుమానాలున్నాయి.
కమిటీలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏది?
మొత్తం ఎన్నికల వ్యవస్థనే మార్చేందుకు వేసిన కమిటీలో రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం ఎందుకు లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రాల అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలి. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ భవిష్యత్ లో జమిలి ఎన్నికల్లో తమ పార్టీని గెలిస్తేనే నిధులు వస్తాయని ఆయా రాష్ట్రాల ఓటర్లను మభ్యపెట్టే అవకాశం లేకపోలేదు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఆ తర్వాత సమస్యల్ని పట్టించుకునేవారే కనిపించరు. రాజ్యాంగం పార్లమెంట్, అసెంబ్లీలు, పంచాయతీలకు వేర్వేరుగా, స్వయంప్రతిపత్తిగా పనిచేయటానికి అధికారాలు ఇచ్చినప్పుడు.. వాటన్నింటిని ఒకే గొడుగు కిందికి తెచ్చేలా ఉన్న ఈ జమిలి ఎన్నికలు స్థానిక సంస్థలను ఎలా ప్రభావితం చేస్తాయో కమిటీ అంచనా వేయలేదు. పార్టీ రహితంగా ఎక్కడో మారుమూలలో జరిగే సర్పంచ్ ఎన్నికకు.. లోక్‌సభ సభ్యుల ఎన్నికకు ఒకేసారి ఎందుకు జరపాలన్నది ప్రశ్న. ఒకేసారి ఎన్నికలు జరపటం వల్ల ప్రస్తుత ఖర్చుకు 17 శాతం అదనంగా జతవబోతోంది.
అన్ని రకాల ఎన్నికలను సమన్వయం చేయడం కష్టం
1992లో ప్రవేశపెట్టిన 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు సంక్రమించాయి. కానీ, జమిలి ఎన్నికల్ని నిర్వహించే క్రమంలో మూడంచెల వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో ఒకే ఎన్నిక ఎలా సాధ్యమో కోవింద్ కమిటీకిగానీ, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన ఉన్నట్టు కనిపించట్లేదు. దేశంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్ని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు సమన్వయం చేయటం చాలా కష్టమైన పని. ఇక రాజ్యాంగంలోని ఐదు, ఆరుషెడ్యూళ్లలో ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి లాంటి అంశాల్ని ఈ జమిలి ఎన్నికల కోసం సవరించాల్సి వస్తుంది. అప్పుడు, దేశంలోని గిరిజనులు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు. స్వీడన్, జర్మనీ లాంటి దేశాల్లో ఒకేసారి ఎన్నికలు జరపటం వల్ల ప్రయోజనాలున్నాయన్న కోవింద్ కమిటీ అక్కడ దామాషా పద్ధతిలో సీట్లు కేటాయిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ముందుకు వెళ్లాలనుకుంటే రాష్ట్రాల అభిప్రాయం కచ్చితంగా తీసుకోవాలి. రాష్ట్రాలు లేనిదే దేశం లేదన్న విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తించాలి.
- తోట లక్ష్మీకాంతరావు,
జుక్కల్ ఎమ్మెల్యే