వరంగల్​ జిల్లా వ్యాప్తంగా..మోదుగుపూల వేడుకలు

  • ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబురాలు  
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఆదివారం రాత్రి కామదహనం చేసి, సోమవారం తెల్లవారుజాము నుంచే చిన్నా, పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకున్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు స్నేహితులు, ప్రజలతో కలిసి సహజ రంగులతో పండుగ జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మహబూబాబాద్​ కలెక్టరేట్​లో కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​తో పాటు ఎస్పీ సుధీర్ రామనాధ్ కెకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో

ట్రైనీ ఐపీఎస్ చేతన్ పండరి, డీఎఫ్​ వో విశాల్ బత్తుల, అదనపు ఎస్పీ చెన్నయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.  ములుగు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీశ్ డీజే పాటలకు తగ్గట్టుగా డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సీఐలు రంజిత్ కుమార్, శ్రీధర్, శంకర్, రాజు, ఆర్ఐ అడ్మిన్ సతీశ్, ఆర్ఐ హోంగార్డ్స్ వెంకటనారాయణ, ఎస్సైలు వెంకటేశ్వర్, రామకృష్ణ, లక్ష్మారెడ్డి, కృష్ణ ప్రసాద్, చల్ల రాజు, సతీశ్ పాల్గొన్నారు.

అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద వాకర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నారోజు రామేశ్వరాచారి ఆధ్వర్యంలో, వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయం (ధర్మశాల) నుంచి ఆర్యవైశ్యులు కలిసి ఊరేగింపుగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం జనగామ పట్టణ అధ్యక్షుడు అరుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. సీఆర్​ తోటలో కాంగ్రెస్​ కౌన్సిలర్​ జక్కుల అనితా వేణుమాధవ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.