హోలీ అంటే రాధ.. హోలీ అంటే కృష్ణుడు... ఒక్క మాటలో చెప్పాలంటే రాధాకృష్ణుల ప్రేమ పండుగ హోలీ. అందుకే ఎక్కడెక్కడ హోలీ పేరు వినపడుతుందో అక్కడ రాధాకృష్ణుల్నీ స్మరిస్తారు. అంతలా హోలీతో రాధాకృష్ణులు ప్రేమ పెనవేసుకుపోయింది. ఎందుకంటే రాధాకృష్ణుల ప్రేమకి రూపమే ఈ రంగుల పండుగ.
కృష్ణుడు నల్లనయ్య.. రాధమ్మ బంగారు రంగులో మెరిసిపోతుంది. మరి ఇద్దరి జోడి కుదిరేదెలా? అనే అనుమానం వచ్చింది కన్నయ్యకి. రాధ తన ప్రేమని ఒప్పుకోదేమో అన్న ఆలోచన కన్నయ్యకు చాలారోజులు నిద్రపట్టనివ్వలేదు. దాంతో ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ తల్లి యశోదమ్మ ఒడికి చేరాడు.
‘‘ అమ్మా! నా శరీరమంతా నలుపుతో నిండి పోయింది కదా!. రాధేమో బృందావనం కాదుకాదు.. లోకంలోనే అందరికన్నా అంద గత్తె.. మరి తను నా ప్రేమని ఎలా అంగీక రిస్తుంది? తనకి నా రంగు, రూపం నచ్చకపోతే ఎలా?” అని తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ అమ్మని అడిగాడు. రాధ అందంపై కస్సుబుస్సులు ఆడుతూ ఫిర్యాదు కూడా చేశాడు. అప్పుడు యశోదమ్మ.. అయ్యో కన్నయ్యా! ఇంత చిన్న విషయానికా ఇంతలా బాధపడుతున్నావ్. అయితే ఒక పని చెయ్యి.. రాధ దగ్గరికెళ్లి తనకి నచ్చిన రంగుని తన ముఖానికి రాయి అంటుంది. యశోదమ్మ చెప్పినట్టే చేస్తాడు కృష్ణుడు. రాధ కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా కృష్ణుడి ప్రేమ రంగులో నిండిపోతుంది. అలా కృష్ణుడు... రాధకి రంగు పూసిన రోజే హోలీ అయిందంటారు. ఈరోజున ప్రపంచమంతా రాధపై కృష్ణుడికున్న ప్రేమని గుర్తు చేసుకుంటుంది. రాధాకృష్ణుల ప్రేమకి గుర్తయిన ఈ పండుగని మధుర, బృందావనాల్లో 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియా డతారు.