కలర్ ఫుల్ హోలీ.. పల్లెల నుంచి పట్నాల దాకా ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్

దేశవ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెల నుంచి పట్టణాలదాకా ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ.. ఏంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా, పేద.. ధనిక తేడా లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు.  

హైదరాబాద్ లో హోలీ సంబురాలు కలర్ ఫుల్ గా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో బ్యాండ్ బాజాలు, డీజేలతో జనం హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ డ్యాన్సలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జనాలతో దుకాణాలు, మార్కెట్లు సందడిగా మారాయి. 

మరోవైపు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ పండుగ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. అన్ని రంగులకు ప్రతీక అయిన హోలీ రంగులలాగా.. జీవితాలలో కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ గడపాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి యూనివర్సిటీలో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

అటు మాజీ మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లి లోని తన నివాసంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. ప్రజలంతా సుఖశాంతులతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ఆయన కోరారు. రసాయనిక రంగులు కాకుండా కృత్రిమ రంగులతో హోలీ సంబరాలు జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 

జగిత్యాల జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ పట్టణంలో మోటారు సైకిల్ పై తిరుగుతూ.. ఎంపీ బండి సంజయ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

హిందువులందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు. రంగు రంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ పిల్లలు, పెద్దలుసహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు బండి సంజయ్..