భద్రాచలం, వెలుగు : వార్షిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామికి పవిత్రారోహణం నిర్వహించారు. ముందుగా స్వామివారికి వేదవిన్నపాలు చేసి ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం, సహస్రధారలతో ప్రత్యేక స్నపనం చేశారు. తర్వాత ప్రధాన ఆలయం నుంచి పవిత్రాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు జరిపించారు.
ముందుగా మూలవరులకు తర్వాత ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు, ఆంజనేయస్వామి, భక్తరామదాసు, గోదాదేవి ఆలయాలకు, ఉత్సవమూర్తులకు పవిత్రాలు వేసిన తర్వాత చివరగా ఆలయ సుదర్శన చక్రానికి, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి ధరింపచేశారు. ఏటా ఆలయంలో సకల దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.