
వీధుల్లో కలర్స్ చల్లుకుంటూ రంగునీళ్లలో తడిసిముద్దవుతూ ఆటపాటలతో మునిగిపోతారు హోలీ రోజు( 2025 మార్చి 14) . మరి రంగుల హోలీ రోజుకు కలర్ ఫుల్ స్వీట్స్ తోడైతే... ఆ ఎంజాయ్ మెంట్ కు పుల్‌స్టాప్ ఉండదు. మరింకెందుకు రుచి కరమైన వెరైటీ స్వీట్లను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
హోలీ స్వీట్... పొటాటో హల్వా ... ఎలా తయారు చేయాలంటే...
- స్వీట్ పొటాటో (మొరంగడ్డ, చిలకడ దుంప) :అరకిలో
- బాదంపప్పు: అర కప్పు
- ఎండు కర్జూరం పేస్ట్: మూడు టేబుల్ స్పూన్లు
- బెల్లం: రెండు టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి: ఒక టీస్పూన్
- బాదం పప్పు, జీడిపప్పు తురుము: రెండు టేబుల్ స్పూన్లు
- నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: బాదంపప్పును నాలుగైదు గంటలు నానబెట్టి పొట్టు తీసి పేస్టు చేయాలి. మొరంగడ్డలను ఉడికించి మెత్తగా చిదమాలి. పాన్ లో నెయ్యి వేడి చేసి చిదిమిన స్వీట్ పొటాటో వేసి కొంచెం మగ్గిన తర్వాత ... బాదంపప్పు పేస్టు వేసి బాగా కలపాలి. ఆతర్వాత ఎండు కర్జూరం పేస్ట్ కూడా వేయాలి.. అవసరమనుకుంటే కొన్ని నీళ్లు కలపొచ్చు. అది గట్టి పడేంత వరకు ఉడికించాలి. తర్వాత బెల్లం వేసి బాగా కలపాలి. చివరగా యాలకుల పొడి వేసి పాన్ దించేయాలి.. బాదంపప్పు, జీడిపప్పు తురుముతో గార్నిష్ చేసి.. స్వీట్ పొటాటో హల్వాని తింటే యమాగా ఉంటుంది.
నోరూరించే కోకోనట్ గుజియా తయారీకి కావలసినవి
- గోధుమ పిండి: అరకిలో
- నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
- నీళ్లు: ఒక కప్పు
- ఉప్పు: చిటికెడు
- కోవా: ఒక కప్పు
- కండెన్స్ మిల్క్: ఒక కప్పు
- చక్కెర: ఒక కప్పు
- పిస్తా :వందగ్రాములు
- కొబ్బరిపొడి. వంద గ్రాములు
- నూనె: సరిపడా
- చక్కెరపాకం : తగినంత (ముందుగా తయారు చేసుకోవాలి)
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని తగినంత ఉప్పు, నెయ్యి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. తర్వాత కోవాలో కండెన్స్, మిల్క్, చక్కెర, పిస్తా.. కొబ్బరి పొడి వేసి కలపాలి. తయారు చేసిన ఉండలను పూరీలా చేయాలి. వాటి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి మధ్యకి మడవాలి. మిశ్రమం బయటకు రాకుండా చివరలు జాగ్రత్తగా వత్తాలి . వాటిని నూనెలో గోధుమ రంగులోకి వచ్చే వరకు వేగించాలి. తర్వాత చక్కెర పాకంలో పది నిమిషాలు ఉంచి తీస్తే కోకోనట్ గుజియా రడీ ..
సపోటాతో వాల్నట్ ఖీర్ తయారీకి కావలసినవి
- వాల్ నట్ తురుము: అర కప్పు
- సపోటా గుజ్జు: మూడు టేబుల్ స్పూన్స్
- పాలు : నాలుగు కప్పులు చక్కెర ముప్పావు కప్పు
- బ్రౌన్ రైస్ : అర కప్పు
Also Read : Holy2025: అరేయ్ రంగు పడుద్ది.. అయినా హేపీనెస్సే..!
బ్రౌన్ రైస్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో పాలు, బ్రౌన్ రైస్ వేసి ఉడికించాలి. రైస్ బాగా ఉడికాక చక్కెర ... వాల్ నట్ తురుము వేసి పది నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపి.. చివరగా సపోటా గుజ్జ కలపాలి. అంతే సపోటా, వాల్నట్ ఖీర్ రెడీ. దీన్ని చల్లగా లేదా వేడిగా తినవచ్చు..
బాదం. ..మలైకుల్ఫీ తయారీకి కావలసినవి
- చిక్కటి పాలు: లీటరు
- బాగా మరిగించిన పాలు : కప్పు
- పాలపొడి : పావుకప్పు
- మొక్కజొన్న పిండి: మూడు టేబుల్ స్పూన్లు
- ఎండుద్రాక్ష: పావు కప్పు
- బాదం: అరకప్పు
- యాలకులపొడి: అర టీస్పూన్
- ప్రెష్ క్రీం : అరకప్పు
- చక్కెర: అర కప్పు
తయారీ విధానం: గిన్నెలో చిక్కటి పాలు పోసి సగం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత మొక్కజొన్న పిండి వేసి చిన్న మంటపై ఉడికించాలి. చిక్కగా తయారైన తర్వాత యాలకులపొడి, చక్కెర, పాలపొడి వేసి ఉండలు కట్టకుండా కలపాలి.. ఇందులోనే ఎండుద్రాక్ష, బాదం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి గిన్నె దించేయాలి. వేడి తగ్గాక ఫ్రిజ్ లో పెట్టి నాలుగు గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. దానికి ఫ్రెష్ క్రీం కలిపి కుల్ఫీ మౌల్స్ లో పోసి ఫ్రీజర్లో పెట్టాలి. ఇక కుల్ఫీలు గట్టిగా అయ్యాక చల్లచల్లగా కొరుక్కొని తింటే .. ఆహా ఏమి రుచిలే కుల్ఫీ... అంటే పాట పాడాల్సిందే మరి..!