బషీర్ బాగ్, వెలుగు: డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డును బైకర్ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. సైఫాబాద్ ట్రాఫిక్ హోంగార్డు కిష్టయ్య గురువారం అర్ధరాత్రి తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న సిగ్నల్ వద్ద డ్యూటీ చేస్తున్నాడు. బారికెడ్లు తీసేందుకు రోడ్డు దాటుతుండగా, ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్తున్న స్కూటీ (TS10EB0274 ) అతడిని వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
ఈ ఘటనలో కిష్టయ్య రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే బైకర్ తన స్కూటీని అక్కడే వదిలి, తన ఫ్రైండ్ వాహనంపై పరారయ్యాడు. అనంతరం సైఫాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కిష్టయ్యను స్థానిక ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం హోంగార్డు పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి కోసం సైఫాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.