ఫిర్యాదు చేసి, పీఎస్​ ముందు కుప్పకూలిన హోంగార్డు.. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన

ఫిర్యాదు చేసి, పీఎస్​ ముందు కుప్పకూలిన హోంగార్డు.. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసి, బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఓ హోంగార్డు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..  రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్(36) రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ లో హోమ్ గార్డుగా పని చేస్తున్నాడు. డ్రైనేజీ విషయంలో ఆదివారం ఉదయం తన ఇంటి పక్కన ఉన్న దాయాదులు మేడిపల్లి పవన్, ప్రశాంత్, యాదమ్మతో వాగ్వాదానికి దిగారు. 

అనంతరం జరిగిన ఘర్షణలో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మధ్యాహ్నం యాచారం పీఎస్​లో వెంకటేశ్  ఫిర్యాదు చేశాడు. అనంతరం బయటకు వచ్చి ఒక్కసారిగా కింద కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుడిని సమీప హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.